రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, జగనన్న తోడు లాంటి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తారు. నేటి అసెంబ్లీ సమావేశం ముగియగానే తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. మంత్రులు, పార్టీ కీలక నేతలు, రీజినల్ ఇన్ ఛార్జ్ లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
చంద్రబాబు అరెస్ట్, టిడిపి-జనసేన పొత్తు ఖరారు నేపథ్యంలో జరుగుతోన్న ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ సూచించిన కార్యక్రమాలను నిర్వహించడంలో విఫలమైన పలువురు నేతలకు మరోసారి జగన్ క్లాస్ తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఏయే ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించేదీ కూడా జగన్ స్పష్టం చేస్తారని కూడా వినిపిస్తోంది. పలు నియోజక వర్గాలకు కొత్త ఇన్ ఛార్జ్ లను నియమిస్తారని సమాచారం.