రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం మొదలైనా ఇంకా ఊపు రాలేదు. రాజకీయ పార్టీలు ఎవరి కార్యక్రమాలతో వారు ప్రజల్లోకి వెళుతున్నా…కొంత నిస్తేజం ఆవరించినట్టుగా ఉంది. బిజెపి, బీ ఆర్ ఎస్ లతో పోల్చితే కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అధికార పార్టీ నుంచి బిజెపి నుంచి వస్తున్న నేతలతో గాంధీ భవన్ సందడిగా కనిపిస్తోంది.
బిజెపి, బీ.ఆర్.ఎస్ ఒక్కటే అనే అంశం ప్రజల్లోకి తీసుకు పోవటంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఆ రెండు పార్టీలకు లోపాయికారిగా ఎంఐఎం సహాయం చేస్తోంది అనే అంశంపై ముస్లిం వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. దేశంలో అందరి మీద ఈడి, ఆదాయ పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. మజ్లీస్ నేతలకు మాత్రం అలాంటి భయమే లేదు. ఆ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయటం తద్వారా బిజెపి లబ్ది పొందటం… కాంగ్రెస్ నష్ట పోవటం అంశాల్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ముస్లిం సమాజానికి వివరించారు.
పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటంతో దూసుకుపోతున్నారు. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం జరుగుతుంది అని వార్తలు వచ్చినా అది జరిగేలా కనిపించటం లేదు. చర్చలు తుది దశకు వచ్చినా…షర్మిల వస్తే తెలంగాణ వ్యతిరేకులు వచ్చారనే ప్రచారం నష్టం చేకూరుస్తుందని రేవంత్ వర్గం అధిష్టానానికి ఏకరువు పెట్టింది.
షర్మిల వస్తే సీట్ల సర్దుబాటు నుంచి పార్టీలో ప్రాధాన్యత వరకు వివిధ అంశాలు ముడిపడి ఉన్నాయి. దివంగత నేత YSR అనుమాయులు అందరు షర్మిలను ప్రోత్సహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. షర్మిల మొదటి నుంచి రేవంత్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో షర్మిల చేరిక సాధ్యం కాకపోవచ్చు. గతంలో చంద్రబాబుతో పొత్తుతో ఏ జరిగిందో ఇప్పుడు షర్మిల రాకతో అదే జరుగుతుందని జాతీయ నాయకత్వం భావించినట్టు సమాచారం.
బీ.ఆర్.ఎస్ తో తెగతెంపులు జరిగాక ఇప్పుడు వామపక్షాలు కాంగ్రెస్ ను దువ్వెందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. వామపక్షాలతో సోపతి అంటే ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ ఖతం అయినట్టే. ఆ రెండు జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. చివరికి వామపక్షాలు కాంగ్రెస్ తో ఉంటాయా…బీ ఆర్ ఎస్ తో ఉంటాయో చెప్పలేం.
వీటన్నింటి కన్నా కాంగ్రెస్ లో వర్గపోరు లేకపోతే గెలుపు నల్లేరు మీద నడకే అని పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్ విజయ భేరి సభ, పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత అందరు ఏకతాటి మీద ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ మధ్య జగ్గారెడ్డి, వి హనుమంత రావు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వంటి వారు అసమ్మతి గళం వినిపించటం లేదు.
రాష్ట్ర ఇంచార్జ్ లు ఉన్నా కేసి వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితర నేతలు నేరుగా పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీంతో ఎవరు ఎక్కువగా మాట్లాడటం లేదు. ఇదే స్పీడు కొనసాగితే బీ.ఆర్.ఎస్ కు కష్టాలు తప్పకపోవచ్చు.