Saturday, November 23, 2024
HomeTrending NewsSupreme Court: చంద్రబాబు కేసు అక్టోబర్ 3కు వాయిదా

Supreme Court: చంద్రబాబు కేసు అక్టోబర్ 3కు వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ కేసులో  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులోనూ నేడు ఉపశమనం లభించలేదు. తనపై ఏపీ సిఐడి నమోదు చేసిన రిమాండ్ రిపోర్ట్ ను కొట్టి వేయాలంటూ బాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) పై విచారణను అక్టోబర్ 3 నాటికి వాయిదా వేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నిర్ణయం తీసుకున్నారు.

వాస్తవానికికి బాబు పిటిషన్ పై నేడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్  భట్టి ధర్మాసనం విచారించాల్సి ఉంది. మధ్యాహ్నం లంచ్ తరువాత కేసు చేపట్టగానే తెలుగువాడైన న్యాయమూర్తి భట్టి ‘నాట్ బిఫోర్ మి’ అని వ్యాఖ్యానించారు. దీనితో మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా కూడా కేసును  తాను విచారణ చేపట్టలేనని బదులిచ్చారు.  ఈ దశలో జోక్యం చేసుకున్న బాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా.. ఈ కేసును వాయిదా వేయకుండా పాస్ ఓవర్ ఇవ్వాలని, మరో బెంచ్ కు బదిలీ చేసి అత్యవసరంగా కేసు విచారణ చేపట్టేలా ప్రధాన న్యాయమూర్తిని తాము అభ్యర్దిస్తామని సంజీవ్ ఖన్నాను కోరిన మీదట ఆయన అంగీకరించారు.

సిద్దార్థ్ లూత్రా సీజే ముందు విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎఫ్ ఐ ఆర్ లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారని, నేడు కేసు లిస్టు అయినా తీసుకోలేదని,  17 (ఏ) ప్రకారం బాబు అరెస్ట్ చెల్లదని వాదించారు. బాబుపై వరుస ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేస్తున్నారని వార్వోనత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ చట్టం రాకపూర్వమే ఈ కేసు నమోదైందని, జీఎస్టీ విభాగం ఈ కుంభకోణాన్ని బైట పెట్టిందని సిఐడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు వచ్చే మంగళవారం (అక్టోబర్ 3 నాటికి) వాయిదా వేశారు.

సరస వెంకటనారాయణ భట్టి (ఎస్వీ ఎన్ భట్టి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందినవారు. చంద్రబాబుది కూడా చిత్తూరు జిల్లా కావడంతో కేసును చేపట్టేందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో వచ్చేవారమే బాబు కేసు విచారణ  జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

స్కిల్ డెవలప్మెంట్ కేసును సిబిఐ తో విచారణ జరిపించాలంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. ఈ కేసులోనూ ఓ న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు ‘నాట్ బిఫోర్ మి’ అనడంతో వాయిదా పడింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్