Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపార్లమెంటు సాక్షిగా...

పార్లమెంటు సాక్షిగా…

Injustice:  ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, కొరకు, కై, వలన, పట్టి, యొక్క, నిన్, నన్, లోన్, లోపల అని విభక్తి ప్రత్యయాలను కలుపుకుంటూ ఎన్ని గొప్ప గొప్ప భావనలయినా అనంతంగా చెప్పుకోవచ్చు. తేలిగ్గా చెప్పాలంటే- ప్రజలకోసం ప్రజలే ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాస్వామ్యం. కానీ- ఆచరణలో ఇది అంత తేలిగ్గా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా, అందరికీ సమ సమానంగా ఉండదు అనడానికి ఉదాహరణలు కోకొల్లలు.

మచ్చుకు తాజాగా పార్లమెంటు కొత్త భవనంలో పెరిగిన కుర్చీల దగ్గర చర్చ మొదలుపెడితే అది ఎంత దూరం వెళుతుందో చూద్దాం. దేశం పేరు చెప్పగానే లేచి నిలబడి పూనకాలు తెచ్చుకుని ఊగిపోయే సన్నివేశాల నుండి పక్కకు వచ్చి…కొంచెం కుదురుగా దక్షిణాది అయిదు రాష్ట్రాల ప్రజలు ఆలోచించాల్సిన విషయమిది. రాజ్యాంగ నిపుణులు చెప్పే అన్వయాలు, అర్థాలు, అంతరార్థాలను కాసేపు పక్కనపెట్టి భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల ప్రజాస్వామ్య ప్రాతినిధ్యం విలువ తగ్గే ఉపద్రవం గురించి ఆలోచించాల్సిన సందర్భమిది. పార్లమెంటు కొత్త భవనంలో తమిళనాడు పురాతన రాజదండం ‘సెంగోల్’ ప్రతీక కూడా మౌనంగా ఉండిపోవాల్సిన సంకట స్థితి ఇది.

దేశంలో జనాభా లెక్కలు లెక్కగట్టే పని ఒకటి బాకీ ఉంది. అది కాగానే పార్లమెంటు స్థానాల పునర్విభజన- డీ లిమిటేషన్ మరొకటి బాకీ ఉంది. ఈ రెండు పనులు జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న పార్లమెంటు స్థానాల సంఖ్య తగ్గి…ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంది.

సులభంగా అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పుకోవచ్చు. చదువు, చైతన్యం, చిన్న కుటుంబ భావన, కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించడం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరిగింది. ఉత్తరాది బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఇక్కడ కంట్రోల్ కావడం ఒక రోజులో జరిగింది కాదు. కొన్ని దశాబ్దాలు పట్టింది. ఇప్పుడిదే దక్షిణాదికి శాపం అయ్యేలా ఉంది.

ఒక అంచనా ప్రకారం-
జనాభా దామాషాలో దక్షిణాదిలో పార్లమెంటు సీట్లు ఇప్పుడున్నవాటితో పోలిస్తే 21 నుండి 24 దాకా తగ్గిపోతాయి. ఉత్తరాదిలో విపరీతంగా పెరుగుతాయి.

మరో అంచనా ప్రకారం-
ఇప్పుడున్న పార్లమెంటు సీట్ల సంఖ్య 543. ఇది 888 అవుతుంది. ఈ పెంపును దృష్టిలో పెట్టుకుని కొత్త పార్లమెంటులో సీట్ల సంఖ్యను విపరీతంగా పెంచి సిద్ధం చేసి ఉంచారు. పార్లమెంటు సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిన తరువాత దక్షిణాదిలో కొన్ని సీట్లు పెరిగినా ఆ నిష్పత్తికి మించి ఉత్తరాదిలో పెరుగుతాయి.

మరొక వాదన ప్రకారం-
దక్షిణాదిలో సీటు ఒక్కటి తగ్గినా వ్యతిరేకత వస్తుంది కాబట్టి…దక్షిణాదిని కదిలించకుండా ఉత్తరాదిలోనే పెంచుకునే ప్రణాళికను సిద్ధం చేశారు.

దక్షిణాది రాష్ట్రాల కావేరీ, కృష్ణా, గోదావరీ బడబాగ్నులు ఆపకుండా ఉత్తరాది పెద్దలు ఎలా ప్రేక్షకులుగా ఉన్నారో? అగ్నికి ఆజ్యం పోస్తూ వచ్చారో? చూశాము. ఇప్పుడు దక్షిణాదిలో ఒక్క సీటు గెలవకపోయినా… ఉత్తరాదిలో గెలిచే సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేంత సౌలభ్యం కూడా వస్తే…దక్షిణాది ఇక ఉత్తరాది కాశీ యాత్రలకు, చార్ ధామ్ హిమాలయ సన్యాస స్వీకారానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.

జనాభా దామాషా ప్రకారం సీట్ల పెంపు అన్నది పైకి సబబుగానే అనిపించినా ఇందులో చాలా లోతుగా చూడాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. రేప్పొద్దున జనాభా ఇంకా పెరిగితే పాతికేళ్ల తరువాత పార్లమెంటు 888 సీట్లను 1888 చేస్తారా? అది సరైన పరిష్కారం అవుతుందా?

చట్టసభల్లో ప్రాతినిధ్యం పొందడానికి పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, ఆకలి కేకల భౌగోళిక జనాభా లెక్కలే కొలమానాలవుతాయా? అభివృద్ధి చెందిన సమాజాలను, ప్రాంతాలను చిన్న చూపు చూడడం ప్రభుత్వాలకు ఒక విధానంగా మారితే...కొన్ని దశాబ్దాలకు ఆ అభివృద్ధి ఇంగువకట్టిన గుడ్డగా మారిపోదా? ఇదొక ఆదర్శంగా, పాలనకు, ప్రతినిధ్యానికి గీటురాయిగా మారితే…బాగా వెనుకబడి ఉండడానికి ప్రజలు, వెనుకబడి ఉండేలా చేయడానికి ప్రజలెన్నుకునే ప్రతినిధులు పోటీలు పడరా?

అభివృద్ధి చెందిన భౌగోళిక ప్రాంతానికి అభినందనగా ప్రభుత్వ ప్రోత్సాహం దక్కాలా? తిరస్కారం దక్కాలా?  ఉన్నవాడిని కొట్టి లేనివాడికి పంచే రాబిన్ హుడ్ సిద్ధాంతం ప్రజాస్వామ్యం అవుతుందా?
“వన్ నేషన్- వన్ ఎలెక్షన్- వన్ హిందీ లాంగ్వేజ్” నినాదాల జై భారత్ హోరులో దక్షిణాది మలయాళ మలయానిలం విలవిలలాడాల్సిందేనా? తమిళ తళతళలు వెలవెలపోవాల్సిందేనా? కన్నడ కస్తూరి పరిమళం కోల్పోవాల్సిందేనా? తెలంగాణ కోటి రతనాల వీణ మూగబోవాల్సిందేనా? ఆంధ్ర తెలుగు వెలుగు తగ్గాల్సిందేనా?

పార్లమెంటులో పెరిగిన కుర్చీల సంఖ్య నేపథ్యంలో ఇప్పుడు దక్షిణాదిలో జరుగుతున్న చర్చ ఇది. ఇందులో ఏది నిజమో? ఏది అభూత కల్పనో? ఏది కుట్రో? ప్రస్తుతానికి అయోమయంగా ఉన్నా…తేనె తుట్టె కదిలిన మాట నిజం.

దక్షిణాదికి అన్యాయం జరగకుండా…ఉత్తరాది పేదలకు అండగా ఉండేలా బహుశా దక్షిణాది రాష్ట్రాలే ఆచరణయోగ్యమయిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదయినా సూచించాలేమో!

భారతీయ న్యాయ సంహితలో దక్షిణాది ధర్మానికి విలువ ఉండదా? భావోద్వేగాల పాచికలు, చీలికలు, పెట్టుబడులు, కట్టుబడులు దాటి భవిష్యత్తును ఆలోచించి…వాణి వినిపించకపోతే…తమ హక్కులకోసం పెదవి విప్పకపోతే…దక్షిణాదికి మిగిలేది బూడిదే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్