అవనిగడ్డలో జనసేన వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. జనసేన ఓ వైపున భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉంటూనే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నామని ప్రరకటించారని విమర్శించారు. పవన్ పొత్తు ప్రకటనపై కాపుల్లోనే వ్యతిరేకత వ్యక్తమైందని, పొత్తు ప్రకటన తర్వాత జరిగిన మొదటి సభ విఫలమైందన్నారు. అందుకే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న అవనిగడ్డలో కూడా పవన్ సభకు జన రాలేదని అన్నారు. పవన్ యాత్రలో పాల్గొనాలని టిడిపి నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ప్రకటనలు కూడా చేశారని అయినా సరే జనం రాలేదన్నారు. నిన్నటి సభ పరిస్థితి కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా మారిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికీ బిజెపితో ఉన్నానని చెప్పుకుంటున్న పవన్, నిన్నటి సభలో టిడిపి-జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందని ఎలా చెబుతారని అంబటి ప్రశ్నించారు. బిజెపితో పొత్తు నుంచి బైటకు రాకుండానే ఇలా ఎలా మాట్లాడతారని అడిగారు. కమలం పార్టీ చెవిలో పవన్ ఓ పెద్ద కాలీఫ్లవర్, క్యాబేజీ పూలు పెట్టారని రాంబాబు ఎద్దేవా చేశారు.
పవన్ బాడీ లాంగ్వేజ్ వీక్ అయిపోయిందని, కాన్ఫిడెన్స్ పోయిందని రాంబాబు పేర్కొన్నారు. ప్రజలు నిన్నటి సభ ద్వారా ఎలాంటి సంకేతం ఇచ్చారో ఆలోచించుకోవాలన్నారు. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పునరుద్ఘాటించారు. మీ పార్టీ జెండాతో పాటు రాహి యాత్ర చంద్రబాబు అవినీతి సొమ్ముతో పోయించిన పెట్రోల్ తోనే నడుస్తుందని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలతో నాశనమవుతున్న తెలుగుదేశం పార్టీని రక్షించాలనే తాపత్రయం తప్ప వేరేది పవన్ లో కనబడడం లేదన్నారు.