ఇప్పుడు అన్నిటికంటే కష్టమైన విషయం ఏమిటంటే … ప్రేక్షకులను రెండున్నర గంటలసేపు థియేటర్లో కూర్చోబెట్టడం. ఈ రెండున్నర గంటల యజ్ఞం కోసమే సంవత్సరాల తరబడి షూటింగులు చేస్తున్నారు. కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉందని అనుకుంటేనే, అప్పుడు థియేటర్స్ కి వస్తున్నారు. కంటెంట్ బాగుందంటే చిన్న సినిమాలకి థియేటర్స్ పెంచడానికి ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు. అలాంటప్పుడు ఆ కంటెంట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అవుట్ పుట్ విషయంలో ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి.
కిరణ్ అబ్బవరానికి స్క్రిప్ట్ సైడ్ కూడా కాస్త అవగాహన ఉంది. ఏ మార్పు అయినా స్క్రిప్ట్ దశలోనే జరిగిపోవాలి. రీ షూటింగు చేసే పరిస్థితి చిన్న సినిమాలకు ఉండదు. అందువలన పేపర్ పైనే పెర్ఫెక్ట్ వర్క్ జరిగిపోవాలి. అంతా అయిపోయిన తరువాత పోస్టుమార్టం చేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. ‘రూల్స్ రంజన్’ చూసిన తరువాత కిరణ్ ఈ కంటెంట్ పై సరైన కసరత్తు చేయలేదేమో అనిపిస్తుంది. లేకపోతే ఇన్ని వైపుల నుంచి ఇన్ని బలహీనమైన ట్రాకులు పడేవి కాదేమో అనే డౌట్ వస్తుంది.
హీరో .. హీరోయిన్ కలిసి లవ్ లో మునిగి తేలాలి .. ఆటలు ఆడాలి .. పాటలు పాడాలి. అలా కాకుండా హీరో సీరియస్ గా ఆఫీసుకు వెళ్లి సిన్సియర్ గా వర్క్ చేసుకుంటూ వెళుతుంటే, ఆయనతో పాటు ఆఫీసుకి వెళ్లవలసిన అవసరం ఆడియన్స్ కి ఎందుకు ఉంటుంది? ముంబైలో ఈ ఆఫీసు వాతావరణం నుంచి హీరోతో పాటు బయటపడిన ప్రేక్షకుడు, తిరుపతిలోనైనా ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. కానీట్విస్టుల మీద ట్విస్టులతో అక్కడ జరిగే ఓవర్ డ్రామాను తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరైపోతాడు. ఈ సినిమా చూసిన తరువాత కిరణ్ కాస్త కేర్ తీసుకోవలసిందే అని మాత్రం అనిపిస్తుంది.