సుధీర్ బాబు కెరీర్ ప్రారంభం నుంచి కొత్తదనం కోసం తపిస్తూనే ఉన్నాడు. తన సినిమాల్తో కొత్తదనం చూపించాలి.. ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేయాలి అనుకుంటున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు కానీ.. ఫలితం మాత్రం తేడాగా వస్తుంది. ఇటీవల హంట్ అనే సినిమా చేశాడు. ఇందులో సుధీర్ బాబు నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు. హీరో నెగిటివ్ క్యారక్టర్ చేస్తే.. జనాలు చూస్తారా..? లేదా..? అనే డౌట్ వచ్చింది. అయితే.. అనుకున్నట్టుగానే సుధీర్ బాబును నెగిటివ్ క్యారెక్టర్ లో చూడలేకపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో గతంలో సమ్మోహనం అనే సినిమా చేశాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తే.. బాగుంది అనే టాక్ వచ్చింది కానీ.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. శ్రీదేవి సోడా సెంటర్ అనే డిపరెంట్ మూవీ చేశాడు. కరుణకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కులాల అంతరాలను తెర పై చాలా చక్కగా చూపించాడు అనే ప్రశంసలు వచ్చాయి కానీ.. కొత్తదనం లేదనే టాక్ రావడంతో కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేశాడు. ఈ చిత్రానికి యాక్టర్ టర్నడ్ రైటర్ హర్షవర్థన్ దర్శకత్వం వహించారు.
మూడు విభిన్న పాత్రల్లో పాత్రకు తగ్గట్టుగా సుధీర్ బాబు బాగానే నటించాడు కానీ.. టిపికల్ స్టోరీని హర్షవర్థన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. దీంతో మామా మశ్చీంద్ర కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు సుధీర్ బాబు ఆశలు అన్న ‘హరోం హర’ సినిమా పైనే ఉన్నాయి. ఈ చిత్రానికి జ్ఞానసాగర్ డైరెక్టర్. టెంపుల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే సీరియస్ పీరియాడిక్ డ్రామా. ఈ చిత్రాన్ని డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. సలార్ వస్తుండడంతో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట.
అసలు సుధీర్ బాబుకు ఘట్టమనేని అభిమానుల సపోర్ట్ ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. మరి.. ఎందుకు సక్సెస్ సాధించడం లేదు అంటే.. కథలు బాగుంటున్నాయి కానీ.. వాటిని ఆ దర్శకులు సరిగా హ్యాండిల్ చేయకపోవడం ఓ కారణం అని చెప్పచ్చు. అలాగే ఆ సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేలా సరిగా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఓ కారణం అని టాక్ వినిపిస్తోంది. వరుస ఫ్లాపులతో సతమౌతున్న సుధీర్ బాబు ఇక నుంచి చేసే సినిమాలతో సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.