కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈరోజు హైదరాబాద్ లోని తన ఆఫీస్ లో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జర్నలిస్ట్ ప్రభు, ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్.. ఇతర కార్యవర్గ సభ్యులను మోహన్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. సినిమా జర్నలిస్టులతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని.. తను నటుడుగా ఈరోజు ఈ స్ధాయిలో ఉన్నానంటే.. దానికి సినిమా జర్నలిస్టులు అందించిన ప్రొత్సాహం కూడా ఓ కారణమని మెహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి జర్నలిస్ట్ ప్రభుతో అనుబంధం ఉంది. ప్రభు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడుగా, అలాగే నాగేంద్రకుమార్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాటి నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ.. సినిమా జర్నలిస్టుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అది గుర్తువచ్చినప్పుడల్లా.. చాలా బాధగా అనిపిస్తుంటుంది. అందరూ బాగుండాలి.. సినిమా జర్నలిస్టుల జీవితాలు కూడా మారాలని మనస్పూర్తిగా కోరకుంటున్నాను.
అసోషియేషన్ అభివృద్థి చెందడానికి తద్వారా జర్నలిస్టుల జీవితాల్లో మార్పు రావడం కోసం ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తానని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. అలాగే ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న వేడుకకు పూర్తి సహాకారం అందిస్తానన్నారు. ఈ సమావేశంలో అధ్యక్షుడు ప్రభు, ఉపాధ్యక్షుడు నాగేంద్రకుమార్ లతో పాటు ఉప కార్యదర్శి చిన్నమూల రమేష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సురేష్ కవీర్యాని, వీర్ని శ్రీనివాసరావు, జిల్లా సురేష్ పాల్గొన్నారు.