ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉపసంహరించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ, పెండింగ్ కేసులు, ఇచ్చిన తీర్పులు, రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు అందజేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.
కేసుల విచారణ వేగంగా జరపాలంటూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టు విచారించింది. స్టేటస్ రిపోర్ట్ అందించేందుకు రెండు వారాల గడువు కావాలని కేంద్ర కోరింది. దీనిపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎందుకింత సమయం అంటూ ప్రశ్నించారు. ఇదే చివరి అవకాశమని, 10 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతివాదులకు కూడా నివేదిక కాపీలు అందజయాలని సూచిస్తూ తదుపరి విచారణను ఆగస్ట్ 25 కి వాయిదా వేసింది.
మరోవైపు దేశంలోని రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అభ్యర్ధిని నిర్ణయించిన 48 గంటల్లోపు నేర చరిత్రను పబ్లిక్ డొమైన్ లో ఉంచాలని ఆదేశించింది. 2020 నవంబర్ లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కొంతమంది అభ్యర్థులు పాటించకపోవడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసుల సత్వర విచారణ పర్యవేక్షణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఈ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు.