సిఎం కెసిఆర్ తొమ్మిదేళ్ళ పాలన బడుగు బలహీన వర్గాల కన్నా బదాబాబులకే ఎక్కువగా మేలు చేసిందనే విమర్శలు ఉన్నాయి. ఒకటి రెండు పతకాలు మినహా అన్ని పథకాలు ఉన్నత వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఉద్యానవన పంటల ప్రోత్సాహం పేరిట పెద్ద తతంగమే జరిగింది. గ్రీన్ హౌస్, పాళీ హౌస్ వ్యవసాయానికి 70 నుంచి 80 శాతం సబ్సిడీ ఇచ్చారు. వీటి ద్వారా రాజధాని చుట్టుపక్కల్లో కలవారి భూములకు కళ వచ్చింది. అప్పటివరకు ఓ రేకుల షెడ్డు నాలుగు మొక్కలు పెట్టుకుని… ఫాం హౌస్ గా చెప్పుకునే వారు. కెసిఆర్ పథకంతో తీరొక్క మొక్కలు..పూలు, పండ్ల తోటలతో ప్రభుత్వ ఖజనాతో మెరుగులు అద్దారు. ఇదే పథకం కోసం అర ఎకరం, ఎకరం ఉన్న రైతులు వెళితే లెక్కలేనన్ని కొర్రీలు. విమర్శలు రావటంతో రెండేళ్ళ నుంచి ఈ పథకం ఆపేశారు.
పంటల సాగు…ధాన్యం కొనుగోలు…మిల్లర్ల మాయాజాలం అదొక సాలెగూడు లాంటింది. మిల్లర్లలో ఒక వర్గం వారు పెత్తనం చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగారని విపక్షాలు కోడై కూస్తున్నాయి. ధాన్యం కొనుగోలులో క్వింటాలుకు కొంత తరుగు తీస్తున్నారు. వారికి తోచినట్టుగా మిల్లర్లు నిర్ణయం తీసుకుంటున్నారని…ప్రభుత్వం చోద్యం చూస్తోందని రైతులు గుర్రుగా ఉన్నారు.
రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల విలువైన కాందిశీకుల భూములకు ఎవరు ఆసాములు అయ్యారో విశ్లేషణలకు అందటం లేదు. హఫీజ్ పేటలో వందల ఎకరాల కాందిశీకుల భూమి పట్టాలుగా మారి… వేగంగా చేతులు కూడా మారుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మహిళా బిల్లు అమలు చేయాలని, ఓబీసీ కోటా ఖరారు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులుగా ఎలాగు అవకాశం ఇవ్వటం లేదు. సిరిసిల్లలో సుమారు 70 వేలు, కోరుట్లలో 60 వేలు, జగిత్యాల-25 వేలు, వేములవాడ 20 వేల వరకు పద్మశాలి(చేనేత వర్గం) ఓట్లు ఉంటాయి. ఈ వర్గం నుంచి అంతో ఇంతో పేరు ఉన్న ఎల్ రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వారి నోరు నొక్కారని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీలో, నామినేటెడ్ పదవుల్లో బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే బాగుండేదని స్వపక్ష నేతలు అంటున్నారు. మంత్రివర్గంలో మహిళలు లేరని విమర్శలు మూటగట్టుకున్నాక సత్యవతి రాధోడ్ కు అవకాశం ఇచ్చారు.
సిఎం కెసిఆర్ దార్శనికత కొన్ని రంగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసు శాఖను బలోపేతం చేయటంలో సిఎం కెసిఆర్ ఏనాడు రాజీ పడలేదు. శాంతిభద్రతల పరిరక్షణకు అధికప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతికంగా తెలంగాణ పోలీసు శాఖ దేశంలో అగ్రస్థానంలో ఉంది.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రోడ్ల అనుసంధానం గణనీయంగా జరిగింది. విద్యారంగానికి కేటాయింపులు తగ్గాయనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపులతో పోలిస్తే తెలంగాణ వచ్చాక విద్యా శాఖకు నిధులు తగ్గాయి. బలహీన వర్గాలను అణగదొక్కేందుకు కెసిఆర్ యత్నిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో సిలిండర్ మీద 400 తగ్గింపు ప్రకటించారు. దీనిపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇన్నాళ్ళు కేంద్రం మీద వేశారు. మొదటి నుంచే ఈ సాయం చేస్తే బాగుండేదని మధ్యతరగతి మహిళలు వాపోతున్నారు.
అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రంగా జరిగిందనే అపవాదు ఉంది. గతంతో పోలిస్తే హైదరాబాద్ నగరంలో మార్పులు వచ్చాయి. రాష్ట్రంలో పట్టణ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ పట్టణాల్లో మురుగునీటి వ్యవస్థ నిర్వహణ అద్వాన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్దంగా కాలనీల రోడ్లు ఉంటున్నాయి.
ద్వితీయ శ్రేణి నగరాలకు హోదాలు తప్పితే మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడా కనిపించటం లేదు. అభివృద్ధి అంతా గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కేంద్రాలుగానే జరుగుతోందని దక్షిణ తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ చాణక్య నీతిలో ఆరితేరిన సిఎం కెసిఆర్ వీటన్నింటిని ఏ విధంగా అధిగమిస్తారో 50 రోజులల్లో తేలనుంది.
-దేశవేని భాస్కర్