బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కమల దళానికి షాక్ ఇచ్చారు. బిజెపికి ఈ రోజు(బుధవారం) రాజీనామా చేశారు. ఎల్లుండి రాహుల్ గాంధి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజగోపాలరెడ్డి పార్టీ మారటం బిజెపికి శరాఘాతమనే చెప్పాలి.
మునుగోడు ఉపఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న రాజగోపాల రెడ్డి…కొద్ది రోజులుగా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తారని జోరుగా ప్రచారం జరిగినా…అరెస్టు జరగలేదు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోతే బిజెపి- బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని రాజగోపాల రెడ్డి అన్నారు. ఆ వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరిగింది. ఇది జరిగిన కొద్ది రోజులకే బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ఆ సమయంలో రాజగోపాల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ని తప్పించటం బాధాకరమని బావోద్వేగానికి లోనయ్యారు. ఇక అప్పటి నుంచి రాజగోపాల రెడ్డి సహా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇతర నేతలు ముభావంగా ఉన్నారు. సిఎం కెసిఆర్ ను ఎదుర్కునేందుకే కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి వచ్చామని ఈ నేతలు బాహాటంగానే ప్రకటించారు.
బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మొదట్లో వీరితో సఖ్యతగానీ ఉన్నా… ఆ తర్వాత ఆయన వైఖరిలో మార్పు రావటంతో వీరికి దూరం అయ్యారు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి తానే అంటూ…అంతర్గత చర్చల్లో రాజేందర్ నిర్మొహమాటంగానే చెప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ ఒక జట్టుగా ఉండటం…పార్టీ కార్యక్రమాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన సీనియర్ నేతలను పరిగణలోకి తీసుకోపోవటం స్పష్టంగా కనిపించింది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు తరచుగా సమావేశాలు కావటం జరిగింది. అసంతృప్త నేతలను ఉరడించే దిశగా ఎన్నికల కమిటీలను బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. కమిటీల్లో వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామిలను నియమించారు. అయినా వీరిలో పార్టీ వ్యవహార శైలిపై నమ్మకం కుదర లేదు. రాజగోపాల రెడ్డితో పాటు వివేక్ వెంకట స్వామి కూడా పార్టీ మరే సూచనలు ఉన్నాయి.
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం నాటి నుంచే పార్టీ మారాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. వీరికి తోడు సోదరుడు కాంగ్రెస్ ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి….ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయమని అదే పనిగా కోరుతున్నాడు.
రేవంత్ రెడ్డితో పోసగకనే పార్టీ మారిన రాజగోపాలరెడ్డి…ఇప్పుడు ఏ తీరుగ వ్యవహరిస్తారో చూడాలి. మునుగోడు సీటు సిపిఐకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది…రాజగోపాల రెడ్డి రాకతో ఏ సీటు ఇస్తారో త్వరలో తేలనుంది.
-దేశవేని భాస్కర్