తెలంగాణలో మొదటి నియోజకవర్గమైన కొమరం భీమ్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లో ఈసారి పోటీ రసవత్తరంగా మారనుంది. బీఎప్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ పోటీకి దిగటం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కోనేరు కోనప్ప, కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్, బిజెపి నుంచి పాల్వాయి హరీష్ రంగంలో ఉన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో కౌతల, బెజ్జూర్, కాగజ్‌నగర్, సిర్పూర్, దహేగావ్, పెంచికల్ పేట, చింతల మానేపల్లి మండలాలు ఉండగా సుమారు లక్ష 80 వేల ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ బిజెపి అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ మీద బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప విజయం సాధించారు. కోనేరు కోనప్పకు 83,088 (50.57 శాతం), పాల్వాయి హరీష్ బాబుకు 59,052 (35.94 శాతం) ఓట్లు వచ్చాయి. ఈసారి పోటీ మరోలా ఉండబోతోంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోనప్పకు… బీఎప్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మధ్య పోటీ నెలకొంది.
సిర్పూరు నుంచి మూడుసార్లు గెలిచిన కోనేరు కోనప్ప నాలుగో దఫా విజయం కోసం కృషి చేస్తున్నారు. నాలుగోసారి గెలిస్తే తనకు ఏదో మంత్రి పదవి వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భావిస్తున్నారు. మొదటి నుంచి జనాల్లో ఉండే నేతగా పేరున్న కోనప్ప ఎన్నికల వేళ మరింత సమయం నియోజకవర్గ ప్రజల కోసం కేటాయిస్తున్నారు.
కోనప్పను డీ కొనటం అంత సులువు కాదు. అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో అనుచరగణం ఉన్నారు. 2017లో పేపర్ మిల్లు పునఃప్రారంభం చేయటంలో కోనప్ప కీలక పాత్ర వహించారు. కరోనా తర్వాత కాగజ్‌నగర్ లో కోనప్ప నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందిస్తారు. వేసవిలో అసెంబ్లీలో రాగి అంబలి అందిచటం కోనప్ప చేస్తున్నారు. కాగజ్‌నగర్ అన్నదాన స్థలంపై విపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రభుత్వం నుంచి 20 ఏళ్ల లీజుకు తీసుకున్నారు. లీజు పేరుతో ప్రభుత్వ భూమి కబ్జా చేశారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
అర్ధరాత్ర అపరాత్రి అనకుండా ఎవరు వెళ్ళినా పలికే కోనప్పకు మంచి పేరు ఎంత ఉందొ చెడ్డ పేరు కూడా అదే స్థాయిలో ఉంది. గులాబీ నేతల్లో కోనప్ప పట్ల కొంత అసంతృప్తి ఉంది. కొందరికే అందుబాటులో ఉంటాడు అని అసంతృప్త వాదులు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి. గిరిజనుల పేరుతో అటవీ భూముల ఆక్రమణ చేశారని ఆరోపణలు… అటవీశాఖ అధికారినిపై కోనప్ప సోదరుడే దాడి చేయించాడని ఆరోపణలు ఉన్నాయి.
తన సోదరులు, బంధువుల ద్వారా ప్రభుత్వ భూములు, అటవీ భూములు కబ్జా చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ దఫా బలమైన ప్రత్యర్థి ఉండటంతో గెలుపు కోసం కష్ట పడాల్సిందే. కోనేరు కోనప్పకు ప్రత్యర్థిగా బీఎస్పీ అధినేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రంగంలోకి దిగారు. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కోనేరు కోనప్ప బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది.
అదే సమయంలో జిల్లా, మండల స్థాయిలో స్వేరోస్ బృందాలుగా పనిచేసిన ఉద్యోగులు, యువకులు మద్దతు తనకు అనుకూలంగా మారతాయని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు ఎక్కువగా బీఎస్పీకి అనుకూలంగా ఉన్నాయనే ఆలోచనతో పాటు 1998లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, అదనపు ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండటంతో సిర్పూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.
ఇక సిర్పూర్ నియోజకవర్గంపై పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభావం అధికంగా ఉంటుంది. అందులోనూ బౌద్ధమతాన్ని అనుసరించే వారు అధికంగా ఉంటారు. సిర్పూర్ నియోజకవర్గంపై అంబేద్కర్ ప్రభావం అధికంగా ఉంటుంది. అన్ని గ్రామాల్లో జై భీమ పేరుతో యువజన, ప్రజా సంఘాలు బలంగా ఉన్నాయి. వీరు అధికశాతం బీఎస్పీ వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఏనుగు గుర్తుకే ఓటు వేస్తామని తీర్మానం చేశాయి.
బంగ్లాదేశ్ ఆవిర్భావ సమయంలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంది కొన్ని బెంగాలి కుటుంబాలకు ఇక్కడ భూమి కేటాయించి ఉపాధి కల్పించారు. వారి ఓట్లు ప్రస్తుతం 30 వేల వరకు ఉంటాయి. బెంగాలీలతో పాటు మరాఠీ ఇతర ఉత్తర భారత ప్రజలు కీలకం కానున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 30 వేల ముస్లీం ఓట్ల కోసం ఏనుగు..కారు పోటీ పడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఆరే బారే కులస్తుల ఓట్లు 20 వేల వరకు ఉంటాయి.
కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ బరిలో ఉన్నా నామమాత్రమనే చెప్పాలి. రావి శ్రీనివాస్ – కోనేరు కోనప్ప బంధువని… పోలింగ్ కు నాలుగు రోజులు ఉంది అనగా కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంతంలో కనిపించడని నియోజవర్గంలో జోరుగా ప్రచారం అవుతోంది. కోనప్ప కోసమే రావి శ్రీనివాస్ పోటీలో ఉన్నాడని స్థానికులు అంటున్నారు.
డాక్టర్ గా మంచి పేరు ఉన్న బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు సైతం అన్ని మండలాల్లో ప్రజలతో మమేకమవుతున్నారు. మొదటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోడీ చరిష్మా గట్టెక్కిస్తుందని… కాగజ్‌నగర్ తో పాటు బెంగాలి, ఉత్తరభారత వోటర్లు ఆదుకుంటారని ఆశతో ఉన్నారు.
కాగజ్‌నగర్ లో ఈ రోజు (ఆదివారం) బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమారు గృహ ప్రవేశం చేశారు. స్థానికేతరుడు… గెలిస్తే ఇక్కడ ఉంటాడా…అనే ప్రచారాల్ని కొట్టి పారేస్తూ ఏకంగా ఇల్లు తీసుకున్నారు. శేష జీవితం కాగజ్‌నగర్ లోనే గడుపుతా అని ప్రవీణ్ కుమార్ ఇదివరకే ప్రకటించారు.
మినీ ఇండియాగా చెప్పుకునే సిర్పూర్ నియోజకవర్గంలో తెలుగు, హిందీ, బెంగాలి, మరాఠీ, ఉర్దూ, ఇతర గిరిజన బాషలు ఉంటాయి. ఈ నియోజకవర్గంలో వాడుక బాషగా హిందీనే అధికంగా వాడుతారు. ఎన్ని పార్టీలు ఉన్నా ఎందరు అభ్యర్థులు బరిలో దిగినా చివరకు పోటీ మాత్రం ఏనుగు – కారు మధ్యనే ఉండనుందని వార్తలు వస్తున్నాయి. గెలుపు వరమాల ఎవరి పరం అవుతుందో మరి కొద్ది రోజులు ఆగితే స్పష్టత వస్తుంది.
-దేశవేని భాస్కర్