పసుపు ఒంటికి పూసుకుంటే మంచిదా?
ఇంటి గడపకు పూస్తే మంచిదా?
ఆహారంగా తింటే మంచిదా?
పాలు, కషాయాల్లో కలుపుకుని తాగితే మంచిదా?
అని మన దేశంలో పాతతరాలు చర్చ చేయలేదు.
కొత్త బట్టలు కొంటే పసుపు పూయనిదే తొడుక్కోని భారతీయులు ఇప్పటికీ కోట్ల మంది ఉన్నారు. మైల, అశుచి పోవాలంటే పసుపు నీళ్లు చల్లేవారు కోకొల్లలు. శుభ కార్యాలు, పేరంటాల్లో పసుపు పూయడం ఆచారం. యజ్ఞ యాగాదులకు ఋత్విక్కులు పసుపు నీళ్ళల్లో తడిపి ఆరేసిన బట్టలు వేసుకుంటారు.
కూరలో, చారులో, పప్పులో, సాంబారులో పసుపు తప్పనిసరి. గాయాలకు పసుపు పూసేవారు కొందరు. గొంతు బొంగురుపోయినా, దగ్గుతో పూడుకుపోయినా…పసుపు పాలు తాగేవారు కొందరు. పసుపులేనిది భారతీయ వంటిల్లు కానే కాదు. పసుపు- కుంకుమ- గంధం లేనిది పూజ గది కానే కాదు.
నమ్మకాలకు శాస్త్ర చర్చతో పనిలేదు. ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా పాటించేవాటిలో శాస్త్రీయమైన అంశాలేమయినా ఉన్నాయా? అని పరిశోధనలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అలా మనం నిత్యం వాడే పసుపులో ఔషధ గుణాలు ఉన్నాయా? ఆహార విలువలు ఉన్నాయా? అని అంతర్జాతీయ వైద్యులు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఒక అధ్యయనం చేసింది.
జీర్ణకోశ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, గాయాలయిన ఒకే రకం అనారోగ్య సమస్యలున్న కొన్ని వందల మందిని ఈ అధ్యయనానికి ఎంచుకున్నారు. ఉదర సంబంధ వ్యాధులున్న వంద మందిని మూడు బృందాలుగా వేరు చేసి ఒక బృందానికి అలోపతి మందులు; ఒక బృందానికి మూడు పూటలా తగిన మోతాదులో పసుపు; ఒక బృందానికి అలోపతి మందులు, పసుపు రెండూ ఇచ్చి…ఫలితాలను పరిశీలించారు.
కేవలం మూడు వందల మందినే ఈ అధ్యయనానికి ఎంచుకోవడం వల్ల ఈ ఫలితాలను గుడ్డిగా నమ్మలేమని శాస్త్రవేత్తల్లో ఒక వర్గం అంటోంది. షరా మామూలుగా ఇందులో కూడా లెఫ్ట్- రైట్ వింగ్ చర్చ మొదలయ్యింది. భారతీయ సంస్కృతిలో భాగమైన ఆచారాల్లో, అలవాట్లలో శాస్త్రీయ రుజువులు ఎన్ని ఉన్నా…ఇంకా ఇంకా రుజువులు కావాలంటూ ఒప్పుకోకుకుండా తాత్సారం చేయడం అమెరికా శాస్త్రవేత్తలకు పరిపాటేనని ఈ విధానాలను ఆచరించే భారతీయ సమాజం అంటోంది. శాస్త్రవేత్తల వాగ్వాదాలు; రుజువులు- ప్రమాణాల మీద సామాన్య జనానికి పట్టింపు ఉండదు.
చెడు పోవాలంటే పసుపు నీళ్లు చల్లుకుంటున్నారు. మంచికి పసుపు పూసుకుంటున్నారు. చిటికెడు పసుపు రోజూ పొట్టలో వేసుకుంటున్నారు. పూసుకోగలిగినంత గడపలకు, మొహానికి పూసుకుంటున్నారు.
“పసుపుముద్దల నుంచి పతికి రోసముఁ బోయు వీరపత్నులు బుట్టి పెరుగునాఁడు ప్రతిన దప్పక వైరిపక్షముల్ బెకలించు వెలమబెబ్బులులు జీవించునాఁడు
కాళిందిలోఁ గత్తిఁగడిగి, తల్లికిఁ జూపు శివరాజు పగతుఱఁ జెండునాఁడు
తమ్మి మొగ్గరము లుద్ధతిఁ జీల్చికొనిపోవు పిల్లవిల్కాండ్రుద్భవిల్లునాడు
పిరికి నెత్తురు నాలోన వెలయ దేమొ!
రంభ, నాపేర నుత్తరాల్ వ్రాయు నేమొ!గారవంబున న న్నేల గాంచవైతి?
తెలుపఁగదమ్మ! ననుఁ గన్న తెలుఁగుతల్లి!”
అన్నాడు గుర్రం జాషువా. పలనాటి సీమలో యుద్ధభూమి నుండి భయంతో వెనుదిరిగి వచ్చిన సైనికులకు గుమ్మాల్లో బిందెతో నీళ్లు, పసుపు ముద్దలు ఇచ్చి…స్నానం చేసి లోపలికి రండి…చీర కట్టుకుందురు కానీ…అని ఎగతాళి చేసి…వారిలో పౌరుషగ్నిని రగిలించి…మళ్లీ యుద్ధభూమికి పంపారట సైనికుల భార్యలు. పసుపు నీళ్ల స్నానం ఒకప్పటి ఆచారం.
విస్సన్న చెప్పింది వేదం అన్నట్లు ఇప్పుడు మనకు అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిందే వేదం.
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టు ముట్టిన తరువాత- వంటింటి తప్పనిసరి దినుసులు-
జీలకర్ర
మిరియాలు
యాలకులు
లవంగాలు
అల్లం
వెల్లుల్లి
నువ్వులు
ధనియాలు
శొంఠి
పసుపు
జవ్వాది
లాంటి అన్నిట్లో అద్భుతమయిన ఔషధ గుణాలు బయటపడుతున్న మాట మాత్రం నిజం. పసుపు పండించిన రైతు నష్టపోవచ్చు కానీ…పసుపును ఉపయోగించుకున్నవారు మాత్రం నష్టపోరట.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018