Sunday, January 19, 2025
HomeTrending NewsPakistan: ఎన్నికలు ఆలస్యం... ముదురుతున్న సంక్షోభం

Pakistan: ఎన్నికలు ఆలస్యం… ముదురుతున్న సంక్షోభం

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలు మరింత ఆలస్యం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, ఆర్ధిక, రాజకీయ సంక్షోభాల ప్రభావం ఎన్నికల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. పార్లమెంటు రద్దయిన 90 రోజుల్లో ఎన్నికలు జరగాలి. ఆగస్టు 9న పార్లమెంట్‌ను రద్దు చేసినప్పటి నుంచి ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. మొదట నవంబర్ ఆ తర్వాత జనవరి అని ఎన్నికల సంఘం ప్రకటనలు చేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో ఇప్పుడు ఖరారైంది.

సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఎన్నికల నిర్వహణపై స్పష్టంగా చెప్పాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని ఆదేశించింది. ఎన్నికల సంఘం న్యాయవాది సజీల్ స్వాతి స్పందిస్తూ.. డిసెంబర్ 5న నియోజకవర్గాల తుది జాబితా, జనవరి 29నాటికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసి, ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనలో పంజాబ్, సింద్ రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. పాక్ అధికార, రాజకీయ వర్గాలు ఈ రాష్ట్రాల వారు కావటం కారణం కాగా రెండు రాష్ట్రాల్లో జనాభా కేంద్రీకృతం అయింది. పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రదర్శిస్తున్న బలూచిస్తాన్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో సీట్లు తగ్గే సూచనలు ఉన్నాయి. నిత్యం అల్లర్లతో అట్టుడుకుతున్న ఈ ప్రాంతాలను ప్రభుత్వమే కావాలని నిర్లక్ష్యం చేస్తోందనే అపవాదు ఉంది.

ఎన్నికలు నాలుగు నెలలు ఆలస్యం కావటం..ప్రభుత్వానికి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా ఉంది.  అప్పటి వరకు విధానపరమైన నిర్ణయాలు జరగవు. రాజకీయ పార్టీలు నెలల తరబడి ప్రచారం ఆర్థికంగా పెను బారం అవుతుంది. హమాస్ – ఇజ్రాయల్ యుద్ధం నేపథ్యంలో పాక్ రాజకీయ పార్టీలు మతోన్మాదాన్ని రెచ్చగొట్టి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నాయి.

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ పలు కేసుల్లో చిక్కుకొని జైలులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రభుత్వం తనను అక్రమంగా కేసుల్లో ఇరికించిందని ఆరోపించారు. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని నవాబ్‌ షరీఫ్‌ స్వదేశానికి చేరుకున్నాడు. బిలావల్ బుట్టో నేతృత్వంలో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) అదృష్టం పరీక్షించుకునే దిశగా ప్రచారం నిర్వహిస్తోంది.

దేశంలో పేదరికం పెరుగుతోంది. చమురు, నిత్యావసరాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. బలూచిస్తాన్, ఖైభర్ పఖ్తుంఖ్వ రాష్ట్రాల్లో తిరుగుబాట్లు ఉపద్రవంలా మారాయి. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్థాన్ అతివాద సంస్థ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పాకిస్థాన్ వ్యతిరేకత తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికలు జరిగేనాటికి

ఏ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టినా భారత్ పై విషం చిమ్మితేనే వాటికి మనుగడ ఉంటుంది. పాక్ పాలనా వ్యవహారాల్లో అమెరికా, చైనాల జోక్యం అధికం. రెండు దేశాలు తమ అనుకూల ప్రభుత్వాలు ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నాయి. రాజకీయ పార్టీలు చైనా కనుసన్నల్లో ఉండగా…పాక్ మిలిటరీ, ISI తదితర నిఘా వర్గాలు అమెరికా మాట జవదాటవు.

-దేశవేని భాస్కర్

Also Read: Pakistan: నవాజ్ షరీఫ్ ఆగమనం పాకిస్థాన్ రాజకీయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్