Friday, November 22, 2024
HomeTrending NewsSuryapeta: మూడోసారి ముగ్గురు పాత ప్రత్యర్థులు

Suryapeta: మూడోసారి ముగ్గురు పాత ప్రత్యర్థులు

సూర్యాపేటలో మూడో దఫా కూడా ముగ్గురు పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు ముచ్చటగా మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 2014లో సంకినేని వెంకటేశ్వర్ రావు మీద రెండు వేల పైచిలుకు ఆధిక్యతతో మంత్రి గట్టెక్కారు. 2018లో రాం రెడ్డి దామోదర్ రెడ్డి మీద ఆరు వేల చిల్లర మెజారిటీతో మంత్రి బయటపడ్డారు. ఈ దఫా వీరికి జానయ్య తోడయ్యారు.

మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేటలో కొంత ఎదురుగాలి వీస్తోందని వార్తలు వస్తున్నాయి. మంత్రి ముఖ్య అనుచరుడిగా పేరున్న  DCMS చైర్మన్ జానయ్య పార్టీ నుంచి వెళ్ళిపోవటం, BSP నుంచి పోటీకి దిగటం చర్చనీయాంశం అయింది. ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు జానయ్య మీద కేసులు పెట్టేవరకు వెళ్ళాయి. జానయ్య మాట అంటే మంత్రి జగదీష్ రెడ్డి విలువ ఇచ్చే వారని, ఆయనకు ఉమ్మడి జిల్లా స్థాయి పదవి కట్టబెట్టారని పార్టీ నేతలు చెపుతున్నారు. భూవ్యవహారాల్లో విభేదాలు తలెత్తాయని స్థానికంగా ఉహాగానాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో మొదలైన గొడవలు తారాస్థాయికి చేరుకొని మంత్రిపైనే పోటీ చేసే స్థాయికి వైరం చేరుకుంది. యాదవ సామాజిక వర్గానికి చెందిన జానయ్య తన గెలుపు సంగతి దేవుడెరుగు మంత్రి ఓడితే చాలు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకన్నా మంత్రి ఓపిక పడితే బాగుండు… జానయ్యపై కేసులు పెట్టి వేధించటం కొంత మైనస్ అని గులాబీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ కాగా ఆ పదవి SC మహిళ అన్నపూర్ణకు కట్టబెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు.  అయితే చైర్మన్ పదవి ఆశించిన వైశ్య వర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని వార్తలు. ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితం చేయటంతో పాటు పలుకుబడి కలిగిన వైశ్య పెద్దలు పైకి మంత్రితో ఉన్నా లోపాయికారిగా పనిచేయటం లేదనే టాక్ ఉంది. వైశ్యుల అసంతృప్తికి ఇతర వర్గాలు తోడయ్యాయని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి రంగంలో ఉండటం మంత్రికి కొంత ప్రతికూలమని స్థానికులు విశ్లేషిస్తున్నారు. రెండు సార్లు స్వల్ప మెజారిటీతోనే బయటపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి ఈ దఫా ఏ విధంగా చక్రం తిప్పుతారో చూడాలి. కాంగ్రెస్ టికెట్ దక్కని పటేల్ రమేష్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సముదాయించినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన స్థానం దక్కుతుందని హామీ దొరికిందని సమాచారం.

పట్టువదలని విక్రమార్క్కుల్లా మూడోసారి డీకొంటున్న ముగ్గురు నేతలు…ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎవరి తరహాలో వారు ప్రచారం సాగిస్తున్నారు. పార్టీలు..అభ్యర్థులు పాతవారే. ఓటరు కరుణ ఎటువైపో… హోరాహోరీగా జరిగే పోరులో ఎమ్మెల్యే పదవి వరమాల ఎవరిని వరిస్తుందో చూడాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్