ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న కులగణన పక్రియ రేపు బుధవారం మొదలు కానుంది. పైలట్ ప్రాజెక్టుగా 3 గ్రామ సచివాలయాలు, 2 వార్డు సచివాలయాల పరిధిలో మొత్తం 5 ప్రాంతాల్లో, రెండు రోజులపాటు ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
ఈ రెండ్రోజుల సర్వే సందర్భంగా క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు, సేకరించాల్సిన సమాచారం విషయంలో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కుల గణనకు సన్నద్ధం అయ్యేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఈనెల 22 వరకు కులగణన లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రేపటి నుంచే జిల్లా స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నారు. విశాఖ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో ప్రాంతీయ సదస్సులు జరుపుతారు. 132 బిసి ఉప కులాల్లో ఎవరి జనాభా ఎంత అనే దానిపై సమగ్ర సమాచారం సేకరించనున్నారు.
జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ కుల గణన జరుగుతుందని, మొత్తం ప్రక్రియను కలెక్టర్లు పర్యవేక్షిస్తారని రాష్ట్ర ప్రణాళిక శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.