తన బినామీల భూముల విలువలు పెరగాలన్న దుర్భుద్దితోనే చంద్రబాబు అమరావతి రాజధాని అనే భ్రమ కల్పించారని, మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి సిఎంగా ఉంటే అన్ని ప్రాంతాలకూ న్యాయం జరుగుతుందా అని నిలదీశారు.
పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, “వైఎస్సార్ పల్నాడు కరువు నివారణ పథకం” క్రింద… రూ. 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పనులను జగన్ మాచర్లలో ప్రారంభించారు. నాగార్జున సాగర్ కు 40 కిలోమీటర్ల ఎగువన నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున మొదటి దశలో 1.57 టిఎంసిల నీటిని తరలిస్తామని, దీనితో 25 వేల ఎకరాలకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందుతుందని వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే ఆర్టీసీ ఉండేది కాదని, కరెంట్ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ఆస్పత్రులు కూడా మూతపడి ఉండేవని ధ్వజమెత్తారు. తనకు అనారోగ్యం వస్తే హైదరబాద్ ఆస్పత్రులకు వెళ్తున్నారని అలాంటి బాబును ఎలా నమ్మగలమని అడిగారు.
ప్రజలకు మంచి చేయాలంటే చిత్తశుద్ది ఉండాలని, నోటిలో నుంచి మాట వస్తే నిజాయతీ ఉండాలని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల వారినీ మోసం చేస్తే ఏం జరుగుతుందో గతఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని, 23 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. కుటుంబంలో పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు రాష్ట్రంలోని కోటి 50 లక్షల కుటుంబాలను వెన్నుపోటు పొడవకుండా ఉంటాడా అని ప్రశ్నించారు, తానూ మారాను అని బాబు అంటే మనం నమ్మగలమా అని ప్రజలనుద్దేశించి అన్నారు. డిబిటి; నాన్-డిబిటి ద్వారా 4 లక్షల 10 వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకూ ప్రజలకు మేలు చేయగలిగామని వివరించారు.
“బాబు నేరాలను కప్పిపెట్టడానికి, విచారణ జరగకుండా అడ్డుకొనేందుకు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి అనేక వ్యవస్థల్లో ఆయన మనుషులు, అనేక పార్టీల్లో ఆయన కోవర్టులు కూడా ఉన్నారు. మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారు” అంటూ ఫైర్ అయ్యారు.
పౌరుషాల గడ్డ పలనాడును అభివృద్ధి గడ్డగా మార్చడానికి ఏడు దశాబ్దాలలో ఎవరూ సాహసం చేయని విధంగా తాము 53 నెలల కాలంలో ఎన్నో అడుగులు వేశామని, ప్రత్యేక జిల్లాగా చేశామని, మెడికల్ కాలేజీలు కూడా తీసుకు వచ్చామని పేర్కొన్నారు. త్వరలో మహా సంగ్రామం జరగబోతోందని… ప్రజలకు ఎవరు మంచి చేశారో, ఎవరు మోసం చేశారో ఆలోచించాలని పిలుపు ఇచ్చారు. బాబు ఎప్పుడూ మాటలు చెబుతుంటారని, గతంలో ఎవరో తాను లేస్తే మనిషిని కాదు అన్నట్లు బాబు వ్యవహారం ఉంటుందన్నారు. 2000 సంవత్సరంలో ఉంటూ 2047 గురించి మాట్లాడుతుంటారని విమర్శించారు.