తెలుగుదేశం-జనసేన పొత్తు ఏపీ రాజకీయాల్లో నవశకానికి నాంది పలుకుతుందని సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఇరుపార్టీల కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ నేడు టిడిపి-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, పాలన చేతగాకే మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో పాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమి వేయాలని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు గోముఖ వ్యాఘ్రాలు అంటూ అభివర్ణించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని, ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరూ ఉద్యమించి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.