Saturday, November 23, 2024
HomeTrending NewsGoshamahal: హాట్రిక్ గెలుపు కోసం రాజాసింగ్

Goshamahal: హాట్రిక్ గెలుపు కోసం రాజాసింగ్

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కరడుగట్టిన హిందుత్వవాదిగా వాణి వినిపించే రాజాసింగ్  సిట్టింగ్ స్థానం ఇది. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ మూడోసారి జయకేతనం ఎగురవేసేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి మొగిలి సునీత, బీఆర్ఎస్ నుంచి నంద కిషోర్ వ్యాస్ బిలాల్ బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2.60.000 వేల ఓట్లు ఉన్నాయి.

2009లో టిడిపి నుంచి కార్పోరేటర్ గా గెలిచిన రాజాసింగ్ ఆ తర్వాత బిజెపిలో చేరారు. 2018 ఎన్నికల్లో బిజెపి గెలిచిన ఏకైక నియోజకవర్గం గోషామహల్ కాగా అసెంబ్లీలో అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించేవారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాక గోషామహల్ రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లి పార్టీ విధానాలు వినిపించే రాజాసింగ్…MIM పేరు ఎత్తితే శివాలెత్తుతాడు.

పాతబస్తీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ప్రభుత్వం..ఒవైసీ సోదరులను సంప్రదించకుండా చేయటం లేదని…పాతబస్తీలో ఒవైసీ సోదరుల కనుసన్నల్లోనే పాలన సాగుతోందని ఘాటుగా విమర్శలు చేశారు. మహమ్మద్ ప్రవక్తపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని ప్రభుత్వం అరెస్టు చేయగా.. పార్టీ నుంచి బిజెపి సస్పెండ్ చేసింది. ఎన్నికల ముంగిట కమలం నాయకత్వం మళ్ళీ పార్టీ టికెట్ ఇచ్చింది. హిందుత్వం కోసమే పనిచేస్తానని బహిరంగంగా ప్రకటించే రాజాసింగ్ ఆ వర్గం ఓట్లనే నమ్ముకున్నారు. లోది సామజిక వర్గానికి చెందిన ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం..రాజాసింగ్ అదే వర్గం కావటం కలిసొచ్చే అంశాలు.

కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మొగిలి సునీతా రావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే మైనారిటీలకు మేలు చేస్తుందని, బిజెపి వ్యతిరేక ఓట్ల పైనే నమ్మకం పెట్టుకున్నారు. స్థానిక నేత, మహిళ అభ్యర్థి కావటం కలిసొస్తుందని భరోసాతో ఉన్నారు. పార్టీ నిర్మాణం ఇక్కడ బలంగా లేకపోవటం ప్రతికూల అంశం.

బీఆర్ఎస్ నుంచి నంద కిషోర్ వ్యాస్ పోటీ పడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వ్యాపార వర్గాలు, మార్వాడి సామాజికవర్గం, మైనారిటీల ఓట్లపై ఆధారపడ్డారు. పార్టీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్..బిజెపిలో చేరటం నందకిషోర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని పార్టీ నేతలు మధనపడుతున్నారు.

నియోజకవర్గంలో సుమారు 60 వేల వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ మజ్లీస్ పోటీ చేయకపోవటం చర్చనీయాంశం అయింది. ఆ పార్టీ నేత ఖాజా బిలాల్.. తాను గోషామహల్‌లో పోటీ చేస్తానంటే అసదుద్దీన్ వద్దన్నారని ఆయన ఆరోపించారు. టిక్కెట్ ఇవ్వనుందుకే రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించలేదని ఖాజా బిలాల్ ఆరోపించారు.

MIM రంగంలో ఉంటే బిజెపికి మేలు జరుగుతుందని, మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కారుకు దక్కాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉంది. రాజాసింగ్ ఓడిపోవాలంటే పోటీలో లేకపోవటమే మంచిదని ఒవైసీ సోదరులు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. ముస్లీముల్లో దీనిపై తప్పుడు వార్తలు వ్యాపిస్తున్నాయి. బిజెపికి మేలు చేసేందుకు మజ్లీస్ పోటీ చేయటం లేదని ప్రచారం అధికంగా ఉంది. దీంతో ఈ వర్గం ఓట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య చీలితే రాజాసింగ్ గెలుపు నల్లేరు మీద నడకే అనే విశ్లేషణ  జరుగుతోంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఇద్దరు కొత్తవారే. రెండు పార్టీల సీనియర్ నేతలు వీరితో సఖ్యతగా లేరని, మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొంటున్నారని సమాచారం. అటు రాజాసింగ్ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉత్తర భారతీయుల ఓట్లు ఇక్కడ కీలకం. వీరిపై ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా ప్రభావం ఉంటుంది.

అయితే రాజాసింగ్ గెలవటం ఆ పార్టీ నేతలకే ఇష్టం లేదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీ భాగ్యనగర్ కాపులుగా తాము ఉంటే ఒకేసారి రాజాసింగ్ తమస్థాయికి చేరుకోవటం వారికి రుచించటం లేదని సమాచారం. బిజెపిలో ఒకరిద్దరు కీలక నేతలు రాజాసింగ్ కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని వినికిడి. గోషామహల్ దంగల్ లో వస్తాదు ఎవరో ఈ నెల 30వ తేదిన ఓటర్లు నిర్ణయించనున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్