కమెడియన్ గా చాలా ఫాస్టుగా ఎదిగిన నటుడు సునీల్. ఒకానొక దశలో సునీల్ లేని సినిమా ఉండేది కాదు. సునీల్ కోసమే ప్రత్యేకంగా పాత్రలను సృష్టించి, తమసినిమాలో ఆయన ఉండేలా మేకర్స్ చూసుకున్నారు. బ్రహ్మానందం .. ఎమ్మెస్ .. వేణుమాధవ్ వంటి స్టార్ కమెడియన్స్ తమ జోరు చూపిస్తున్న సమయంలో తన మార్కు కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయనకి త్రివిక్రమ్ రాసిన పాత్రలు బాగా పేలాయి. కమెడియన్ గా వచ్చిన క్రేజ్ ఆయనను హీరోగా చేసింది.
హీరోగానూ సునీల్ సక్సెస్ లతోనే తన ప్రయాణం మొదలుపెట్టాడు. హీరోగా చేసినా కంటెంట్ లో కామెడీ ఉంచడాన్ని మరిచిపోలేదు. అయినా అలా కొంత దూరం వెళ్లాక ఆయనకి హీరోగా వరుస పరాజయాలు ఎదురవుతూ వచ్చాయి. ఇక హీరోగా చేస్తే కెరియర్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని ఆయన భావించాడు. అందువల్లనే తిరిగి కమెడియన్ గా వెనక్కి వచ్చేశాడు. అయితే సునీల్ ను మళ్లీ కామెడీ పరంగా నిలబెట్టే పాత్రలు పడలేదు. ఈ సారి ఆయన కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేసిన పాత్రలు కూడా అంతగా ప్రభావం చూపించలేకపోయాయి.
అలాంటి పరిస్థితుల్లో సునీల్ తనకి వచ్చిన వేషాన్ని వేస్తూ … ప్రాధాన్యత కలిగిన పాత్రలను చేస్తూ వెళ్లాడు. ఈ జాబితాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలు కూడా ఉన్నాయి. అలా విలన్ పాత్రల దిశగా వెళ్లిన సునీల్ అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేశాడు .. మళ్లీ నిలదొక్కుకున్నాడు. అయితే తన మార్క్ కామెడీని మళ్లీ చూపించాలనే ఆసక్తి ఆయనలో అలాగే ఉంది. అలాంటి పాత్ర ఆయనకి చిరంజీవి – శ్రీవశిష్ఠ సినిమాలో పడిందని అంటున్నారు. చిరంజీవితో పాటు సినిమా మొత్తం కనిపించే ఈ పాత్రతో, సునీల్ నాన్ స్టాప్ గా నవ్విస్తాడని చెబుతున్నారు. ఇక కమెడియన్ గా కూడా సునీల్ మరింత బిజీ అవుతాడేమో చూడాలి.