Tuesday, November 26, 2024
HomeTrending NewsRevanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అనేది ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా చర్చోపచర్చలు చేసిన అనంతరం ఈ రోజు(మంగళవారం) ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంది. సిఎల్ పి నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. పార్టీలో సీనియర్ నేతలకు సముచిత స్థానం ఉంటుందని, సమిష్టి నిర్నయాలతోనే ప్రభుత్వం కొనసాగుతుందని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎల్లుండి(డిసెంబర్ -7న) ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలను కలిసేందుకు రావాలని ఆహ్వానం రావటంతో ఢిల్లీ పయనమయ్యారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణంలో ఉండగానే అధిష్టానం నిర్ణయం వెల్లడించింది. గత సంప్రదాయాలకు భిన్నంగా కాంగ్రెస్ మీడియా సమావేశంలో సిఎం ఎవరు అనేది ప్రకటించటం సంచలనం అనే చెప్పుకోవాలి. సీల్డు కవర్ సంప్రదాయం పక్కన పెట్టడం గమనార్హం. ఇక ఉపముఖ్యమంత్రి పదవులు ఎన్ని అనేది రెండు రోజుల్లో తేలనుంది.

మంత్రిగా కూడా అనుభవం లేని రేవంత్ రెడ్డి.. కేవ‌లం ఎమ్మెల్యే నుంచి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం దక్కింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు డిసెంబర్ 9న మీ కష్టాలు తీరుతాయని, మొదటి సంతకం నోటిఫికేషన్ల మీదనే అని ప్రకటించారు. కాంగ్రెస్ లో ఈ విధంగా ఓ నేత ప్రకటిస్తే రచ్చ అవుతుంది. ఆరు గ్యారంటీలపై కూడా రేవంత్ రెడ్డి పలుమార్లు తనదైన శైలిలో మాట్లాడి…కాంగ్రెస్ నుంచి సిఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అనే పరిస్ధితి కల్పించారు.

తెలంగాణ రాష్ట్రానికి సిఎం బాధ్యతలు నిర్వహించిన కెసిఆర్… ఇప్పుడు కాబోయే సిఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ ద్వారానే నాయకులుగా ఎదిగిన వారు కావటం ఆసక్తికరమైన అంశం.

రేవంత్ రెడ్డి బయోడేటా

టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి.. ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా వంగూర్‌ మండలం కొండారెడ్డిప‌ల్లిలో న‌వంబ‌ర్ 08, 1969న జ‌న్మించారు. వీరిది వ్య‌వ‌సాయ కుటుంబం. తండ్రి పేరు దివంగ‌త అనుముల న‌ర్సింహ రెడ్డి. త‌ల్లి అనుముల రామ‌చంద్ర‌మ్మ‌. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కి చెందిన రేవంత్ రెడ్డి చిన్న‌నాటి నుంచే రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి క‌న‌బ‌రిచేవారు. గ్రాడ్యూయేష‌న్ చ‌ద‌వుతున్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్ నాయ‌కుడిగా ఉన్నారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఏ.వీ. కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన త‌ర్వాత ప్ర‌ముఖ కాంగ్రెస్ నాయ‌కుడు జైపాల్ రెడ్డి మేన‌కోడ‌లు గీతాను వివాహ‌మాడారు. అనంత‌రం తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తిస్థాయి రాజ‌కీయ కార్య‌క‌లాపాల్లోకి దిగారు.

2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ టికెట్‌పై కొడంగ‌ల్ నుంచి పోటీ చేశారు. 2018 తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ ముగ్గురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల‌లో ఒక‌రిగా ఆయ‌న నియ‌మితుల‌య్యారు. 2017 రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2015 ఒక శూల‌శోధ‌న ఆప‌రేష‌న్‌లో దొరికిపోవ‌టంతో ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయాల్సిందిగా ఆంగ్లో-ఇండియ‌న్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌స‌న్‌కు డ‌బ్బులివ్వ‌జూపార‌న్న‌ది రేవంత్ రెడ్డిపై ఉన్న ఆరోపణ‌.

రాజ‌కీయంగా ..

1992లో విద్యార్థిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌లో స‌భ్యుడయ్యారు. 2004లో ఆయ‌న తెలుగుదేశం పార్టీలో చేరారు. 2006 జెడ్‌టీపీసీ ఎన్నిక‌ల్లో మిడ్జిల్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి నెగ్గారు. 2008లో రేవంత్ రెడ్డి టీడీపీలో మ‌రోసారి చేరారు.  2008 శాస‌న‌మండ‌లి ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. 2009 ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డిని ఓడించారు. 2014లో మరోసారి కొడంగ‌ల్ లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి గురునాథ్ రెడ్డిపై గెలిచి రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు.

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా..
రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్‌లో టిడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్‌ రెడ్డిని తెలంగాణ పీసీసీ అధ్యక్ష్యుడిగా 26 జూన్ 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది.

డైరెక్ట్ ముఖ్య‌మంత్రిగా..?
ఆయన 2021 జులై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈసారి అసెంబ్లీ ఎన్నికలు 2023లో కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల‌ నుంచి పోటీ చేశారు. 2023 ఎన్నిక‌ల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్