రాష్ట్ర ప్రజలకు మరో మూడు నెలల్లో కష్టాలు తొలగిపోనున్నాయని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం నందివెలుగు గ్రామంలో మిచాంగ్ తుపానుతో దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించి రైతులను పరామర్శించారు.
పంట చేతికి వచ్చే సమయంలో తుపాను వచ్చి రైతులకు అపార నష్టం వాటిల్లిందని, 90 శాతం పంట పొలాల్లోనే మునిగిపోయిందని, ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ నష్టం మరింత ఎక్కువైందని అన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడంతో ఆ మురికి నీరు పొలాల్లోకి వచ్చిందని… తాను పర్యటనకు వస్తున్నానని తెలిసి సిఎం హడావుడిగా బయల్దేరారని విమర్శించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అధికారులు ఎవరూ వెంటనే స్పందించలేదని, సిఎం కూడా ప్రజలు నష్టపోయిన ప్రాంతాల్లో కాకుండా ఎక్కడో పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఎకరాకు 50 వేల రూపాయలు నష్టపోయారని, ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదని అన్నారు.
45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడూ తప్పు చేయలేదని, అయినా సరే 53 రోజులు జైల్లో పెట్టి క్షోభకు గురిచేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపితే జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. తన అరెస్ట్ తో పార్టీ శ్రేణులు భయపడిపోతారని అనుకున్నారని, కానీ అందరూ రోడ్లపైకి వచ్చి వీరోచితంగా పోరాడారని కొనియాడారు.