కార్తీ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘సర్దార్’ .. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను భారీ వసూళ్లను రాబట్టాయి. ఆ తరువాత ఆయన చేసిన ‘జపాన్’ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఎస్.ఆర్. ప్రకాశ్ – ప్రభు నిర్మించిన ఈ సినిమాకి, రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. కార్తి కెరియర్ లో ఇది 25వ సినిమా కావడం విశేషం. అందువల్లనే ఆయన ఈ కథపై ప్రత్యేకమైన శ్రద్ధపెట్టాడు.
ఈ సినిమాలో తాను డిఫరెంట్ లుక్ తో కనిపించేలా .. తన బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండేలా కార్తి ప్రత్యేకమైన దృష్టి పెట్టాడు. కథలో కామెడీ టచ్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నాడు. అయినా ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది .. అంచనాలను అందుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘నెట్ ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. త్వరలోనే తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తేనున్నామని చెప్పారు.
కథాపరంగా కార్తి ఈ సినిమాలో దొంగగా కనిపిస్తాడు. భారీ దొంగతనాలుచేస్తూ, తన మార్క్ చూపిస్తూ ఉంటాడు. ఒకసారి 200 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది. జపాన్ మార్క్ స్టైల్లో దోపిడీ జరగడంతో ఆయనను పట్టుకోవడానికి భారీ స్థాయిలో పోలీస్ బలగాలు రంగంలోకి దిగుతాయి. అప్పుడు జపాన్ ఏం చేస్తాడు? అసలు ఆయనే ఈ దోపిడీ చేశాడా? అనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఏ స్థాయి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.