Friday, September 20, 2024
HomeTrending NewsLoddi Mallaiah: ముక్కోటి ఏకాదశి రోజే దర్శనం

Loddi Mallaiah: ముక్కోటి ఏకాదశి రోజే దర్శనం

శైవ క్షేత్రాలకు ప్రసిధ్ధి గాంచిన నల్లమల కొండలే భూ లోక కైలాసమన్నది ప్రామాణిక ఆధారం. కోటలకు, ప్రాచీన ఆదివాసి జాతి, తెలుగు మాట్లాడే చెంచు తెగకు ఈ అడవిప్రాంతం అలవాలం కావడంతో ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ అడవులు, కొండలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి.

నల్లమలలో పురాతనమైనది లొద్ది గుహ. త్రిభుజాకారంలో ఉన్న రాతి ముక్క ఒకటి దేవుడికి సమీపంలోనే ఉన్నది. దాని మీద జీవావశేషాలను స్థానికులు బ్రహ్మరాత అంటారు. ఆదిమానవులు గుహల్లో, అడవుల్లో తలదాచు కున్నారని తెలియజేసే ఆనవాళ్లైన వారి రాతి పనిముట్లు ఈ గుహ చుట్టు పక్కల పదేసి ప్రాంతాలలో లభించాయి. అటువంటి పనిముట్లను పురావస్తు నిపుణులు సేకరించి ఇటీవల తెలుగు విశ్వవిద్యాలయం శ్రీశైలం ప్రాంగణానికి తరలించారు.
లొద్దికి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల పొడవు, వెడల్పులతో నిర్మించిన చంద్రగుప్తి పట్టణం శిథిలాలున్నాయి. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలానిది. మరికొందరి ప్రకారం విక్రమాదిత్య బిరుదాంకితుడైన రెండవ చంద్రగుప్తుని కాలానిది. శ్రీశైలఖండం, పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత పురాణం మొదలైన ప్రాచీన గ్రంథాలలో వర్ణించిన‘గుప్త మల్లి ఖార్జున క్షేత్రం ’ ఇదేనని కొందరు పండితుల అభిప్రాయం. ఇక్కడికి 15 కి.మీ.ల దూరంలో శ్రీశైలం ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వరాలయం ఉంది. లొద్దిలోని లోపలి గుహలోని లింగానికి, గుప్తమహేశ్వరాలయంలోని లింగానికి పోలికలున్నాయి. రెండూ చతురస్రాకార పానవట్టంలో ఉన్నాయి. రెండింటికీ ఊర్ధ్వ పుండ్రాలు (నామాలు- మధ్యది ఎత్తుగా) ఉన్నాయి.
ఇంతటి ప్రాధాన్యం గల అడవుల్లో నాగర్ కర్నూల్ (ఒకప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా) జిల్లాలోని అమ్రాబాద్‌ గుట్టల్లో ఒక మహిమాన్వితమైన లోయ ఉంది. దాన్ని భక్తులు లొద్ది, అని గుండం అని వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలో వెలిసిన మల్లన్న స్వామి పేరుమీద లొద్దిమల్లయ్య గుడి అని కూడా ఇక్కడి దేవాలయాన్ని పిలుస్తారు. ఈ గిరి సముద్ర మట్టానికి 914 మీటర్ల ఎత్తున ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది. హైదరాబాద్‌కు 145 కి.మీ, శ్రీశైలానికి 60 కి.మీల దూరంలో ఉంటుంది.
హైదరాబాద్‌ శ్రీశైలం రోడ్డులో అటవీ కార్యాలయం నుంచి ఒక పావు కిలోమీటర్‌ దూరం నడవగానే ఒక కిలోమీటరు లోతైన లోయలు, కొండలు, అడవుల మధ్య అందంగా కనిపిస్తుంది.

లోతైన లోయ కావడంతో పైనుంచి చూస్తే కళ్లు తిరగడం ఖాయం. కిందికి దిగిన తర్వాత పైకి ఎక్క గలుగుతామా అని అనుమానం రావడం ఖాయం పైనుంచి అరగంట పయనించాక లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. అక్కడికి చేరుకున్నాక మనకు అరకిలోమీటరు లోతైన కొండ అడుగున ఉన్న అనుభూతి కలుగుతుంది. ధారవాగు నుంచి తూర్పు వైపుకు తిరుగగానే మనకొక అద్భుతమైన విశాలమైన గుహ కనిపిస్తుంది. అరకిలోమీటరు ఎత్తైన గుట్ట నుంచి గొడుగు లాగా ఒక దరి పడమటి వైపుకు పొడుచు కొచ్చినట్టు ఉంటుంది. ఆ దరికింద రెండువేల మంది వరకు మెసల వచ్చు. ఆ దరి ముందట విశాలమైన గుండం ఉంది. గుండం ఒక పెద్ద బండరాయి మీద ఏర్పడడంతో వందల మంది అందులో స్నానం చేసినా అందులోని నీళ్లు మురికి కావు.
మల్లిఖార్జున లింగం
గుండంలో స్నానం చేసి ఉత్తరం వైపు సాగితే అక్కడే మల్లికార్జున ఆలయం దర్శనమిస్తుంది. అక్కడికి త్వరగా చేరుకోవడానికి వీలుగా అచ్చంపేట పట్టణ ప్రముఖులు 1953లో రైలు పట్టాలతో చేసిన 20 మెట్ల నిచ్చెనను గుట్ట నుంచి గుహలోకి జారవేశారు.
గుహలో గుహ
సాధారణంగా భక్తులందరూ లింగస్వామిని దర్శించుకుని వెనుతిరిగి వెళ్తారు. కాని అక్కడి వింత ప్రకృతిని కొద్దిసేపు ఆస్వాదిద్దామని చుట్టూ చూస్తూంటే స్వామికి ఉత్తరాన మరో గుహ కనిపిస్తుంది. అందులోకి ధైర్యంగా ముందుకెళ్లాలి. మరో చీకటి గుహ కనిపిస్తుంది. సెల్‌ ఫోను లైటు వేసుకుని ముందుకు వెళితే చీకటి గుహలో దారి కనిపిస్తుంది. అక్కడ కొంత వెలుతురులో ఒక అద్భుతం కనిపిస్తుంది. అది మరోశివలింగం.
కృష్ణానది ఎడమ ఒడ్డున ఉన్న ‌నాగర్‌ కర్నూల్ జిల్లా దక్షిణ ప్రాంతంలో పైన విశేష పరిశోధన (తవ్వకాలు) చేసిన ఐ.కె శర్మ , డి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి తదితర చరిత్రకారులు ఈ ప్రాంతంలో మలి శాతవాహనుల కాలం ( క్రీ. శ 1,2 శతాబ్దాలు) నాటికే కృష్ణాతీరం పొడవునా ఇటుకలతో నిర్మించిన శివాలయాలు వెలిశాయని నిర్థారించారు. ఇక్కడి మల్లిఖార్జునాలయం కూడా ప్రాచీన ఇటుకలతో నిర్మించినదే. లొద్ది వైపు ప్రారంభమయ్యే దారి మధ్యలో కూడా ప్రాచీన ఇటుక నిర్మాణాలున్నాయి.. ఐతే వాటి సైజును రికార్డు చేస్తే ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక విశేషాలు వెల్లడవుతాయి. సలేశ్వరం ఆలయం ముందరి గోడపై ‘ సర్వేశ్వరం అని రాసి ఉంది. కనుక శ్రీపర్వత పురాణంలో సర్వేశ్వర తీర్థంలో కలిపి పేర్కొన్న పుష్కరతీర్థం ఈ లొద్దిలోని గుండమే. ఇక్కడి గుండంలోని బండపై నిలబడి వాటర్‌ ఫాల్‌ (జలధారల) కింద నిల్చుని ఉంటే ఆ నిలుచున్న వాళ్లు పాపాత్ములైతే ఆ జలధారలు పక్కకు తొలగిపోతాయని పురాణంలోని ఈ క్రింది పద్యంలో ఉన్నది..
మనుజ శ్రేణులు తానమాడను శిలామధ్యంబుపై నిల్చినన్‌
ఘన దుర్కర్మఠులైన పై బడక త ద్గ్రాహొప కంఠంబునన్‌
జన లంఘించి తొలంగు, పుణ్యుల పయిన్‌ సంధిల్ల వర్షించుని
ద్దిన కృత్యంబు పవిత్ర ‘పుష్కర మహా తీర్థాంబు’ ధారావళుల్‌.
ఇంతటి పవిత్రత, ప్రకృతి సౌందర్యం కలిగిన లొద్ది మల్లన్న గుడికి ఏటేటా భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతున్నది. శివభక్తులు, సాహస పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు, పరిశోథకులు తప్పకుండా దర్శించవలిసిన స్థలం లొద్ది. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి మాత్రమే ఇక్కడికి వెళ్ళే వీలు కల్పిస్తారు.

పర్యాటకుల రాకపోకలకు సౌకర్యాలు మెరుగుపరిస్తే రాబోయే రోజుల్లో మరింత మంది ఇక్కడికి రావటానికి వెసులుబాటు కలుగుతుందని స్థానికులు అంటున్నారు. తద్వారా వివిధ వ్యాపారాలతో స్థానికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్