గుంటూరులో జరుగుతోన్న నంది నాటకోత్సవాలకు ప్రేక్షకాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతిభావంతమైన, అద్భుత నటనా కౌశలం వున్న నటీనటులు తమ ప్రదర్శనలతో అబ్బురపరుస్తున్నారు. ఈ ప్రదర్శనలలో మూడో రోజు సోమవారం రెట్టించిన ఉత్సాహంతో చూపరులందరినీ ఆకట్టుకున్న ప్రదర్శలు దేనికదే తమ ప్రత్యేకతలను చాటుకున్నాయి. దాంతో ‘హాలు నిండినది’ తరహా పరిస్థితి నిర్వాహకులకు తప్పలేదు.
శ్రీరామ పాదుకలు:
ఈ ప్రదర్శనలలో తొలిగా సవేరా ఆర్ట్స్ సంగీత సాహిత్య నాటక సంస్థ కడప వారు సమర్పించిన ‘‘శ్రీరామ పాదుకలు’’ పౌరాణిక పద్య నాటకం ప్రదర్శితమైంది. రామాయణం పాదుకా పట్టాభిషేక ఘట్టం ఈనాటక ప్రధాన ఇతివృత్తం. భరతుని సోదర భక్తికి, శ్రీరాముని ధర్మ నిరతిని ప్రతిబింబించేలా నాటకంలో ఈ ఘట్టాన్ని చిత్రించిన తీరు చాలాబాగుంది. కైకేయి ధర్మవతిగా, ఆమె దాసి మంధర హీన గుణాల పుట్టగా పేరు పొందటం వెనుక ఉన్న నిజాన్నిఈ నాటకం ఆవిష్కరించింది. సీతమ్మ స్వయంవరానికి లంకాధిపతి రావణబ్రహ్మ వెళ్లటం, శివధనస్సును ఎక్కుపెట్టాలని ప్రయత్నించి విఫలమొంది పరాభవంతో రగిలిపోయిన సన్నివేశాల నాటకీకరణ బాగుంది.
శ్రీరాముని వియోగం భరించలేక దశరథుడు మరణించినాడు. తల్లి చేసిన తప్పు తెలుసుకుని భరతుడు రాముని చేరి తిరిగి అయోధ్యకు చేరమని ప్రార్థించటం, రాముడు ధర్మ మర్మాలను వివరించి నిరాకరించటం లాంటి సన్నివేశ ప్రదర్శనలలో నటన ప్రశంసనీయంగా వుంది.. రామభద్రునికి మారుగా శ్రీరామ పాదుకలను తీసుకొని ఆ పాదుకలనే మకుటాలు లేని మహారాజుల్లా అయోధ్యను పదునాలుగేళ్లు పరిపాలించటం లాంటి ఘట్టాలు భక్తి రసాన్ని ఆవిష్కరించాయి. నాటకం ఆధ్యంతం రసజనకంగా సాగింది. ఈ నాటకాన్ని లక్ష్మీ కులశేఖర్ రచించారు. తాళ్ళూరి వెంకటయ్య దర్శకత్వం వహించారు.
‘మంచి (గుణ) పాఠం:’
ఇది సోమవారం నాటి రెండో ప్రదర్శన. ఈ నాటికను డాక్టర్ పి.వి.ఎన్.కృష్ణ రచించారు. పి. సాయిశంకర్ దర్శకత్వం వహించారు. శ్రీరామా ఇంగ్లీషు మీడియం హైస్కూలు విజయవాడ బాలలు దీన్ని ప్రదర్శించారు. బాల కళాకారులు తమ నటనను నిరూపించుకున్న బాలల నాటిక ఇది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా బాల కార్మిక వ్యవస్థను రూపు మాపలేక పోవటం విచారకరమని, దానికి ఏంచేస్తే బాలలందరికీ ఉజ్వల భవిత దక్కుతుందో చూపిన నాటిక ఇది.
‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ నాటకం:
బండల పక్కన ఏరు .ఏరు పక్కన ఊరు. ఊరుకొక్క పోరు అంటూ పోరాటాలు, ఆరాటాలు వీటన్నిటి నేపధ్యలో ప్రపంచానికి పోరాటం నేర్పిన కళాకారుడు పరిస్థితి తనదాకా వస్తే ఎలావుంటుందన్న విషయాన్ని ఝనక్ ఝనక్ పాయల్ బాజే నాటిక చూపించింది. ఎంఎస్ చౌదరి రచన దర్శకత్వాలలో తెనాలి వారు ఈ నాటకాన్ని ప్రదర్శించారు. రచన ఎంఎస్. చౌదరి
ని’శ్శబ్ధమా….నీ ఖరీదెంత?’ (నాటిక)
పి.టి.మాధవ్ నాటకీకరణలో చలసాని కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఇది ప్రదర్శితమైంది. ప్రస్తుత సమాజంలో కొన్ని వివాహాల అనంతరం యువతీ యువకుల్లో తలెత్తుతున్న అవగాహనా రాహిత్యాలు, వివాహేతర సంబంధాలు; మంచికోసం రూపొందించిన చట్టాలను అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న అనైతిక కార్యాలవల్ల నష్టపోతున్న వారి జీవిత గాథలను ఈ నాటిక చూపించింది.
కధ పరంగా కుమార్ తండ్రి ఒక విప్లవ రచయత. విప్లవ భావాలున్న ఆ తండ్రి తన కొడుక్కి మరో రచయిత కూతుర్ని యిచ్చి ఆదర్శ వివాహం చేసాడు. కానీ ఆమె అతనితో యిమడలేకపోయింది. ఆమె కలలు కన్న భర్త అతను కాదన్నది ఆమె భావన. కుమార్ తన తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం ఆమె భరించ లేకపోయింది. కన్నకూతుర్ని తీసుకెళ్ళిపోతుంది. మరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకోవటం, దీన్ని ప్రశ్నించిన కుమార్ పై 498-ఎఐపీసి కేసు, మనోవర్తి కేసులు పెట్టటం, అక్రమ సంబంధానికి అడ్డుగా వుందిని కన్న కూతిరినే అంతం చెయ్యటం ఇలాంటి విషాదకర సంఘటనల నేపధ్యంలో ‘‘ నిశ్వబ్దమా నీ ఖరీదెంత ? ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇంకెన్నాళ్ళు….?
ఇది ‘దిశ’ యధార్థ కథ ఆధారంగా ఆధారంగా రూపొందిన నాటిక. అనంతపురం ఎస్ ఎస్బి ఎన్ డిగ్రీ కాలేజి విద్యార్థులు ఆముదాల సుబ్రహ్మణ్యం రచన దర్శకత్వాలలో ఈ నాటికను ప్రదర్శించారు. అత్యారం చేసి ‘ఎన్ కౌంటర్’ లో మరణించిన నలుగురు యువకులు ఆత్మలుగా మారి తమ తప్పులకు పశ్చాత్తాప పడటం, అత్యాచారానికి, హత్యకు గురైన యువతి కూడా (దిశ) కూడా ఆత్మరూపంలో వచ్చి ఆ నలుగురి మీద తీవ్ర కోపంతో వుండటం, చివరకు ఆమె విషాద గీతాలాపన ఇవన్నీ ‘ఫ్లాష్ బ్యాక్’ పద్ధతిలో నాటకీకరించి ప్రేక్షకుల చేత కంట తడి పెట్టించి, సందేశాన్నిచ్చిన నాటిక ఇది. యువతరం నాటక రంగంలో రాణిస్తున్న తీరుకు అద్దం పట్టింది ఈ నాటిక.
‘కమనీయం’ నాటిక
ఏ కళారూపమైనా తన ఉనికిని నిలబెట్టుకుంటుంది అంటే అది కేవలం కళాకారుడివల్ల..దాన్ని ఆదరించే కళాహృదయుల వల్ల. కళాకారుడు తన వారసత్వాన్ని మరో కళాకారుడికి అందిస్తున్నట్లే కళాహృదయులు కూడా తమ కళాభిమానాన్ని భావితరాలకు పరిచయం చేయాలని చెబుతూ..వైజ్ఞానికంగా ఎన్ని మార్పులు వచ్చినా కళారూపాలు ప్రదర్శించే చోటికే ప్రేక్షకుడు వచ్చేలా ఒక మంచి నిర్ణయం తీసుకొని, సమర్ధవంతమైన సంఘటితమైన సమసమాజ ఆవిష్కరణవైపు అడుగులు వేయించే ‘‘కమనీయమైన’’ కళారూపాలను ఆదరించాలని ఆకాంక్షిస్తుంది ఈ నాటిక.రచయిత అరుదైన అంశాన్ని నాటకం చేస్తే, దాన్ని అంతే నైపుణ్యంతో దర్శకుడు ‘డ్రమటైజ్’ చేశారు. రచన : విద్యాదర్ మునిపల్లి దర్శకత్వం : బసవరాజు జయశంకర్
‘జరుగుతున్న కథ’ (నాటిక)
తల్లిదండ్రులు తమ సంతానానికి ఆర్థిక పరిపుష్టి కలిగించడానికి తమ శక్తియుక్తులన్నీ ధారపోస్తారు. అందుకు తమ అవసరాలను కూడా వారు మరచిపోతారు. తమకు ఏమీ మిగుల్చుకోరు. మరి ఇలా అన్నీ… బిడ్డల కోసమే ఇచ్చేస్తే, శాపమైన వృద్ధాప్యంలో ఎవరు వారిని ఆదరిస్తారు. అపహాస్యం పాలైన మానవ సంబంధాలు ప్రతిక్షణం చూస్తున్నదే కదా! బిడ్డల చేతుల్లో అమ్మానాన్నలు ఇలా అవమానాల పాలు కావలసిందేనా! వృద్ధాప్యంలో మీకు కావలసింది ఏమిటీ? జీవితచరమాంకంలో మన అవసరాలు తీర్చేదెవరు? సమకాలీన సమస్యను అరవింద్ ఆర్ట్స్ తాడేపల్లి వారు నాటకీకరించారు. రచన: వల్లూరు శివప్రసాద్ దర్శకత్వం: గంగోత్రి సాయి