Saturday, November 23, 2024
HomeTrending NewsTablighi Jamaat: తబ్లిగీ జమాత్‌ కు ప్రభుత్వ నిధులు... విమర్శలు

Tablighi Jamaat: తబ్లిగీ జమాత్‌ కు ప్రభుత్వ నిధులు… విమర్శలు

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా పరిగిలో జనవరి 6,7,8 తేదీల్లో జరిగే ఇస్లామిక్ అతివాద సంస్థ ” తబ్లిగీ జమాత్” సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేయటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. సమావేశాల నిర్వహణకు ఏకంగా రూ. 2.45 కోట్లను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో రిక్రూట్‌మెంట్‌కు “పైప్‌లైన్”‌గా పని చేస్తున్న “తబ్లిగీ జమాత్‌”కు ప్రభుత్వ నిధులు ఇవ్వటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని పెంచి పోషిస్తోందనే ముద్ర తబ్లిగీ జమాత్‌పై ఉంది. అనేక దేశాల్లో ఈ సంస్థ నిషేధానికి కూడా గురైంది. అటువంటి సంస్థకు అప్పనంగా ప్రజాధనం కట్టబెట్టటాన్ని తప్పుపట్టిన హిందూ సంఘాలు… ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉప సంహరించుకుని నిధుల విడుదలకు బ్రేక్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

అల్లా మాటలను బోధించే వారిని ఇస్లాంలో “తబ్లిగీ”లు అని పిలుస్తారు. జమాత్ అంటే సంస్థ అని అర్ధం. తబ్లిగీ జమాత్ అంటే సంక్షిప్తంగా అల్లా మాటలను బోధించే సంస్థ అని చెప్పుకోవచ్చు. వీరందరూ సమావేశమయ్యే స్థలాన్ని మర్కజ్ అంటారు. 1926 లో హర్యాణాలోని “మేవాట్” ప్రాంతంలో “మౌలానా ఇలియస్ కాంద్లావి” అనే ముస్లిం మత గురువు ఈ సంస్థను ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ తరువాత అతను ఢిల్లీ సమీపంలోని దర్గా హజ్రత్ నిజాముద్దీన్‌కు తన మకాంను మార్చాడు. అక్కడి నుంచి క్రమ క్రమంగా దేశం మొత్తం ఈ సంస్థను విస్తరించాడు.

1947 దేశ విభజన నాటికి పాకిస్థాన్, సౌదీ అరేబియా, ప్రస్తుత బంగ్లాదేశ్, దక్షిణ ఆసియాలోనే అనేక దేశాలకు తబ్లిగీ జమాత్ మత ప్రచార కార్యకలాపాలు విస్తరించాయి. 1975 నాటికి ఆగ్నేయ ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఫ్రాన్స్, యూకే తదితర దేశాలకు తబ్లిగీ జమాత్ విస్తరణ కొనసాగింది. 2006 నాటికి ఫ్రాన్స్‌లోనే లక్ష మందికి పైగా యాక్టివ్ సభ్యులను కలిగిన సంస్థగా తబ్లిగి జమాత్ ఎదిగిందంటే.. ఈ ఇస్లామిక్ అతివాద గ్రూపు ఏ స్థాయిలో విస్తరించిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 150కు పైగా దేశాల్లో 80 మిలియన్ల వరకు అనుచరులు తబ్లిగీ జమాత్‌లో ఉన్నారనే అంచనాలు ఉన్నాయి.

తబ్లిగీ జమాత్ సభ్యులు “ఖురూజ్” (మతమార్పిడి పర్యటనలు) చేస్తూ ఉంటారు. నెలకు 10 రాత్రులు, సంవత్సరానికి కనీసం 120 రోజులు దీనికి కేటాయిస్తారు. స్థానికంగా ఉండే మసీదులు, దర్గాలను కేంద్రంగా చేసుకుని తబ్లిగీ జమాత్ తన కార్యకలాపాలను చాప కింద నీరులా కొనసాగిస్తూ ఉంటుంది. ముస్లిం యువతీ, యువకుల్ని ఆకర్షించటం, వారికి బ్రెయిన్ వాష్ చేయటం , మత ఛాందసవాదాన్ని నూరి పోయటం వంటివి వీరి దైనందిన కార్యకలాపాల్లో భాగంగా ఉంటాయని విమర్శలు ఉన్నాయి. ప్రతీ ఏటా “ఇజ్తేమా” అని పిలిచే వార్షిక సమావేశాలను తబ్లిగీలు నిర్వహిస్తారు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ అనుచరులను ఆహ్వానిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు లక్షలాది మంది తబ్లిగీలు వస్తుంటారు. జనవరి నెలలో వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించతలపెట్టిన తబ్లిగీ జమాత్ వార్షిక సమావేశాలను ఇందులో భాగంగానే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు పూర్తిగా ప్రైవేటు వ్యవహారం. తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 2.45 కోట్ల రూపాయలను ఈ మీటింగ్స్‌ కేటాయించటం పట్ల సామాన్య ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

తబ్లిగీ సంస్థ బోధనలు, మూల సిద్ధాంతాలు ఇస్లామిక్ రాడికల్ గ్రూపుల్లో చేరటానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ మానసికంగా సిద్ధమైన అనేక మంది ఆ తరువాత మతోన్మాదులుగా, టెర్రరిస్టులుగా మారుతూ ఉంటారని అమెరికన్ “ఫారిన్ పాలసీ కౌన్సిల్” పేర్కొంది. పలు దేశాలకు చెందిన అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు తబ్లిగీ జమాత్‌ను “ట్రాన్స్-నేషనల్ ఇస్లామిస్ట్ నెట్‌వర్క్”గా పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో జాయిన్ అయ్యే 80 శాతం మందికి పైగా మిలిటెంట్లపై తబ్లిగీ జమాత్ ప్రభావం ఉంటుందనే అంచనాలూ ఉన్నాయి. ఆల్ ఖాయిదా, లష్కర్ ఏ తోయిబా, జైషే మహ్మద్, ఐసిస్ వంటి అనేక ఉగ్రవాద సంస్థల్లో తబ్లిగీ నుంచి ట్రైన్ అయిన మిలిటెంట్లు జాయిన్ అవుతూ ఉంటారని అపవాదు ఉంది.

ఇస్లామిక్ టెర్రరిజం వ్యాప్తికి ఓ పైప్‌లైన్ గా.. ముఖద్వారంగా తబ్లిగీ జమాత్ పని చేస్తుందనటానికి అనేక ఆధారాలను ప్రపంచ దేశాలు చూపిస్తున్నాయి. ఈ కారణంతోనే ఇరాన్, ఉజ్బెకిస్థాన్, తజికిస్థాన్, కజకిస్తాన్, రష్యా మరియు సౌదీ అరేబియా తదితర దేశాలు ఈ సంస్థపై నిషేదాన్ని కొనసాగిస్తున్నాయి.

2020 కరోనా సమయంలో మలేషియాలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం వల్ల కరోనా కేసులు ఎంతలా పెరిగాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇండియా, ఇండోనేషియా , సింగపూర్ , థాయ్‌లాండ్ , కంబోడియా , వియత్నాం , ఫిలిప్పీన్స్‌, బంగ్లాదేశ్, శ్రీలంక సహా అనేక ఇతర దేశాల్లో వేలాదిగా కరోనా కేసులు పెరిగి పోయాయి. ఏకంగా ఆగ్నేయాసియా మొత్తం కరోనా గుప్పెట్లో చిక్కు కోవటానికి తబ్లిగీ జమాత్ సమావేశాలు కారణం అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. కరోనా వ్యాప్తి సమయంలో మహారాష్ట్రలోని వాసాయిలో తబ్లిగీ జమాత్ సమావేశాలకు ప్లాన్ చేశారు. ప్రభుత్వం అంగీకరించక పోవటంతో ఢిల్లీలోని నిజాముద్దీన్ వెస్ట్ ప్రాంతంలో “మర్కజ్ మసీదు” ప్రాంగణంలో తబ్లిగీ సమావేశాలను నిర్వహించారు. పర్యాటక వీసాల మీద వచ్చిన అనేక మంది ముస్లింలు ఈ సమావేశాల్లో పాల్గొనటమే కాకుండా.. భారతదేశంలో కరోనా మహమ్మారి మరింత వ్యాపించటానికి కారకులయ్యారు. సుమారు 22 వేల మందికి పైగా తబ్లిగీలను భారత ప్రభుత్వం క్వారంటైన్‌కు పంపిందంటే.. కరోనా వ్యాప్తిలో వీరి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సహా అనేక సంఘాలు ముక్త కంఠంతో “తబ్లిగీ జమాత్” ఉదంతంపై గళమెత్తుతున్నాయి. వ్యక్తిని కేంద్రంగా చేసుకుని ఇస్లామిక్ మత ఛాందసవాదాన్ని నూరి పోయటమే ఈ సంస్థ లక్ష్యమనే విమర్శ ఉంది. తబ్లిగీ జమాత్‌లో ప్రేరణ పొందిన ముస్లిం యువకులు ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్లో మిలిటెంట్లుగా చేరిపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తబ్లిగీ జమాత్ సమావేశాలకు అందించే ఆర్థిక సహాయాన్ని తక్షణం ఆపేయాలని, ఆ సమావేశాలపై ఆంక్షలు విధించాలని వీహెచ్‌పి, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ వంటి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటుబ్యాంకు రాజకీయాల కోసమే ప్రధాన రాజాకీయ పార్టీలు తబ్లిగి సమావేశాలపై మాట్లాడటం లేదని ఆరోపించాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్