Saturday, November 23, 2024
HomeTrending NewsBJP: లోకసభ ఎన్నికలు... తెలంగాణ బిజెపి

BJP: లోకసభ ఎన్నికలు… తెలంగాణ బిజెపి

తెలంగాణ బిజెపి లోక్ సభ ఎన్నికలకు సమాయాత్తం అవుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం(డిసెంబర్ 27)న హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గాల వారిగా వచ్చిన ఓట్ల శాతం విశ్లేషించి…ఎంపి సీట్లు అధికంగా గెలిచేందుకు ఉన్న సవాళ్లు.. తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు.

రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల్లో పార్టీ బలం, బలహీనతలు… ఆశావాహ అభ్యర్థుల నేపథ్యం తదితర అంశాలపై నేతల అభిప్రాయాలు అమిత్ షా స్వీకరిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయటంలో జరిగిన ఆలస్యం ఫలితాలపై ప్రభావం చూపిందని ఇప్పటికే ఢిల్లీ నేతలకు వివరించారు. దీంతో ఎంపి అభ్యర్థుల పేర్లు సాధ్యమైనంత త్వరగా ఖరారు చేస్తారని తెలిసింది.

రాష్ట్రంలో బిసి నినాదం ఎత్తుకున్న బిజెపి…ఎంపి స్థానాల్లో బిసిలకు అగ్రస్థానం కల్పిస్తుందా అనే అంశపై రేపటి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బిసిలు, మాదిగలకు ప్రాధాన్యత దక్కుతుందని, రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేదిశగా పార్టీ నాయకత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోందని విశ్వసనీయ సమాచారం.

మూడో దఫా కావటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని సీట్లు తగ్గే సూచనలు ఉన్నాయని, ఆ నష్టాన్ని దక్షిణాదిలో భర్తీ చేయాలని కమలం నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో అవకాశం ఉందని…అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్ల శాతమే ఇందుకు నిదర్శనమని నేతలు అంటున్నారు.

ఎంపి బరిలో నిలిచేందుకు తెలంగాణలో పోటీ తీవ్రంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మాతోనే గెలుస్తామని రాష్ట్ర నేతల అంచనా. అసెంబ్లీలో చేతు గుర్తుకు ఎంపి ఎన్నికల్లో పువ్వు గుర్తుకు వేస్తామని పట్టణాల నుంచి గ్రామాల వరకు శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. దీంతో కమలదళం జోష్ లో ఉంది.

మరోవైపు బిజెపి శాసనసభ పక్ష నేత ఎవరు అనేది ఎంపిక చేయాల్సి ఉంది. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డిల మధ్య పోటీ ఉంది. రాష్ట్రస్థాయి అంశాల్లో రాజాసింగ్ మాట్లాడలేరని…మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి పార్టీ తరపున మాట్లాడారు. అయితే మహేశ్వర్ రెడ్డితో పోల్చితే కొత్తగా ఎన్నికైన వెంకటరమణ రెడ్డి పార్టీ విధానాలను స్పష్టంగా చెప్పగలుగుతారని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, కె లక్ష్మణ్ ప్రభావం లేకుండా… పార్టీ విధానాలు స్పష్టంగా చెప్పగలిగేది వెంకటరమణా రెడ్డి అని ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీ పెద్దలకు నివేదించినట్టు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ముషీరాబాద్, అంబర్ పేట్ స్థానాలు కోల్పోవటంలో వీరి విధానాలే కారణమని ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్ర నేతల మధ్య సయోధ్య లేదని ఫిర్యాదులు అందిన దృష్ట్యా… అమిత్ షా పర్యటనలో దీనిపై ప్రత్యేకంగా చర్చజరగనుందని తెలిసింది. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్ వర్గం – బండి సంజయ్, ధర్మపురి అరవింద్ వర్గాల మధ్య బేదాభిప్రాయాలు తొలగించటం ప్రధానమని నేతలు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్