సాధారణంగా ఇండస్ట్రీకి పరిచయమయ్యే ఏ హీరో అయినా లవ్ స్టోరీతోనే ఎంట్రీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమకథలు కూడా ట్రెండును బట్టి మారుతూ వెళుతున్నాయి. ఒకప్పుడు ప్రేమకథలు అనగానే ‘అభినందన’ .. ‘ప్రేమ’ .. ‘గీతాంజలి’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పటి ప్రేమకథల పరిస్థితి వేరు. తెరపై ప్రేమికులు కనిపించే విధానం వేరు .. వాళ్లు మాట్లాడుకునే మాటలు వేరు. ఇలాంటి అంశాలన్నీ ట్రెండ్ ఖాతాలోనే వేసుకోవాలి.
అలాంటి ట్రెండ్ లో వచ్చిన సినిమానే ‘బబుల్ గమ్’. సుమ – రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మానస అనే అమ్మాయికి కూడా ఇది ఫస్టు మూవీనే. కథా పరంగా చూసుకుంటే హీరోకి ఒక ఆశయం ఉంటుంది .. దాని కోసమే అతను కష్టపడుతూ ఉంటాడు. అతనికి కాస్త ఎమోషన్స్ ఎక్కువ. కానీ ఏ మాత్రం ఎమోషన్స్ కి విలువనీయని హీరోయిన్ ను చూడగానే మనసు పారేసుకుంటాడ. ఒక వైపున ప్రేమ .. మరో వైపున ఆశయం .. ఈ రెండింటి మధ్య హీరో సాగించిన ప్రయాణమే ఈ కథ.
రోషన్ కి ఇది ఫస్టు సినిమానే అయినా, ఎక్కడా అలా కనిపించడు. చాలా సహజంగా చేస్తూ వెళ్లాడు. మానస కూడా తన పాత్రకి తగినట్టుగా నటిస్తూనే అందంగా కనిపించింది. యూత్ ఆశించే అల్లరి .. ఆటపాటలు .. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అయితే ఆడియన్స్ ఆశించే స్థాయిలో కథనంలో వేగం కనిపించదు. అయినప్పటికే అవుతుందిలే అన్నట్టుగా అలా నిదానంగా నడుస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేకపోవడం కూడా యూత్ ను కొంత నిరాశ పరుస్తుంది. సంగీతం .. ఫొటోగ్రఫీ ఈ సినిమాను కొంతవరకూ నిలబెట్టాయనే చెప్పుకోవాలి.