చైనాలో కరోన మహమ్మారి వెలుగులోకొచ్చిన అంశంపై మరోసారి విచారణ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించిన డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తొందరలోనే ఈ బృందం మరోసారి వుహాన్ వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి ఎప్పటికప్పుడు రూపురేఖలు మారుతూ ప్రపంచాన్ని వనికిస్తోందని, దీన్ని రూపుమాపేందుకు నిపుణుల పరిశీలన ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ తో అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. డబ్ల్యుహెచ్‌ఓ బృందం పరిశీలన, విచారణ మరింత మెరుగైన పరిష్కారం కనుగునేందుకు ఉపయోగపడుతుందని, రాజకీయ కోణంలో వివాదం చేయొద్దని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఈ బృందంలో చైనాను కూడా భాగస్వామిని చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
అయితే డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ ప్రతిపాదనను చైనా తిరస్కరించింది. అమెరికాలో కొత్త ప్రభుత్వం వచ్చాక జో బైడేన్, చైనాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, రెండోసారి విచారణ పేరుతో ఏ బృందం వచ్చినా అనుమతించే ప్రసక్తే లేదని చైనా తెగేసి చెపుతోంది. మొదటి దశలో కూలంకుషంగా పరిశీలన చేసిన తర్వాత మరోసారి అవసరం లేదని చైనా పొంతన లేని వాదనలు చేస్తోంది. నెల రోజులుగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కమ్యునిస్ట్ పాలకులతో అనేక దఫాలుగా సంప్రదింపులు జరుపుతున్నా వారు పెడచెవిన పెడుతున్నారు.