టోక్యో ఒలింపిక్స్ లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి పాల్గొన్న క్రీడాకారులను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో కాంస్య పతకం గెల్చుకున్న పి.వి. సింధు, మహిళా హాకీ జట్టుకు ఆడిన రజని, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఆడిన సాత్విక్ సాయి రాజ్ రాంకీ రెడ్డిలను రాజ్ భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో మెమెంటోతో సన్మానించారు.
రెండు వరుస ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పి.వి. సింధు దేశానికే వన్నె తెచ్చి చరిత్ర సృష్టించారని గవర్నర్ ప్రసంశించారు. ఆమె తల్లిదండ్రులిద్దరూ క్రీడాకారులే కావడంతో బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఆమెకు వారసత్వంగా లభించిన వరమని అన్నారు. భారత మహిళల హాకీ జట్టు కొద్దిలో కాంస్యపతకం కోల్పోయినా, తమ ఆట తీరుతో యావత్ దేశ ప్రజల హృదయాలను గెల్చుకున్నారని గవర్నర్ వ్యాఖ్యానించారు. సాత్విక్ రెడ్డికి మంచి భవిష్యత్ ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో క్రీడలు,యువ్వజన సర్వీసుల ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ భార్గవ్, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా, క్రీడల శాఖ ఎండి ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.