Saturday, November 23, 2024
HomeTrending Newsమహబూబ్ నగర్ ఎంపి సీటుపై పార్టీల ఫోకస్

మహబూబ్ నగర్ ఎంపి సీటుపై పార్టీల ఫోకస్

లోక్ సభ ఎన్నికల్లో పాలమూరు ఉమ్మడి జిల్లాపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. పాత జిల్లాలోని మహబూబ్ నగర్ జనరల్ స్థానం కాగా , నాగర్ కర్నూల్ ఎస్సిలకు రిజర్వు అయింది. జనరల్ స్థానమైన మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీల్లో నేతల మధ్య పోటీ నెలకొంది.

మహబూబ్ నగర్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన మన్నే శ్రీనివాస్ రెడ్డి ఎంపిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎంపి మన్నే శ్రీనివాస్ రెడ్డి పారిశ్రామిక వేత్త. ఎంపిగా గెలిచిన తర్వాత ప్రజల సంగతి దేవుడు ఎరుగు.. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు అందుబాటులో ఉండేవారు కాదని అపవాదు ఉంది.

మొదట్లో ఎంపి చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా… MSN ఫార్మా మీద అదాయపన్ను శాఖ దాడుల తర్వాత స్తబ్దుగా ఉన్నారని జిల్లా నేతలు అంటున్నారు. దీనికి తోడు ఎంపి అన్న కుమారుడు, పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఉత్సహంగా ఉన్నారు.

శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆశించగా సిట్టింగ్ లకే  టికెట్ అనటంతో కాంగ్రెస్ లో చేరాలని యత్నించారు. అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళటం ఖాయమని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఎంపి శ్రీనివాస్ రెడ్డికి వెన్నముకగా ఉండే జీవన్ రెడ్డి వెళ్ళిపోతే ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వటం అనుమానమే. ఈ నేపథ్యంలో కొత్త నేత కోసం అన్వేషణ సాగుతోంది.

ఎంపిగా పోటీ చేసేందుకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలు ఆసక్తిగా ఉన్నారని వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. పార్టీ నాయకత్వం వీరి అభ్యర్థిత్వంపై గుంబనంగా వ్యవహరిస్తోంది.

కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఆశిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా వంశీచంద్ మహబూబ్ నగర్ నుంచి బరిలోకి దిగుతానని పార్టీ అధిష్టానానికి స్పష్టం చేశారు. కాంగ్రెస్ టికెట్ మన్నే జీవన్ రెడ్డి కోరుతున్నా ఆయనకు ఇవ్వకపోవచ్చని సమాచారం.

మన్నే శ్రీనివాస్ రెడ్డి ఎంపిగా వైఫల్యం చెందారనే ప్రచారం నియోజకవర్గంలో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి టికెట్ ఇచ్చినా నష్టం జరుగుతుందనే భావనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని తెలిసింది. ఎంపిగా శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గానికి ఏం చేశారని…జీవన్ రెడ్డి గెలుస్తే ఏం చేస్తారని ప్రజల్లో టాక్ మొదలైంది.

మహబూబ్ నగర్ లో బిజెపి టికెట్ కోసం సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కల్వకుర్తిలో ఓడిపోయిన ఆచారి ఆసక్తి చూపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి ఫైఫల్యం వల్లే మహబూబ్ నగర్ లో ఓడిపోయామని పార్టీకి నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో ఆచారి, డీకే అరుణల మధ్య పోటీ ఉందని వినికిడి. డీకే అరుణ అభ్యర్థిత్వం ఖాయం అవుతుందని అంటున్నారు. డీకే అరుణకు ఇవ్వకపోతే ఆమె పార్టీ మారుతారని, కాంగ్రెస్ నుంచి ఆమెకు లభిస్తుందని కమలం నేతలు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్