Saturday, September 21, 2024
HomeTrending Newsపవన్ కట్టడికి టిడిపి నయా వ్యూహం..?

పవన్ కట్టడికి టిడిపి నయా వ్యూహం..?

తెలుగుదేశం – జనసేన మధ్య పొత్తుల్లో ఓ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ను దారిలోకి తెచ్చేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త ఎత్తుగడ వేశారని వినికిడి. ఎంపి స్థానంలో పోటీ చేయించి లోక్ సభకు వెళితే కేంద్రంలో మంత్రి పదవి ఖాయమని నమ్మబలుకుతున్నారని టాక్ మొదలైంది.

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే టిడిపి తరపున…బిజెపి కూటమి అధికారంలోకి వస్తే నేరుగా కలిసేందుకు ఎలాగు అవకాశం ఉందని పవన్ కు టిడిపి ముఖ్యులు వివరించారని సమాచారం. విశాఖపట్నం, నరసాపురం ఏదో ఒక స్థానం నుంచి పవన్ పోటీ చేస్తారని రెండు పార్టీల్లో ప్రచారం జరుగుతోంది. నరసాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు వైఖరి మరోలా ఉంది. పొత్తుల్లో నరసాపురం టిడిపికి దక్కితే సైకిల్ గుర్తుతో…లేదంటే జనసేన తరపున పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద మనసులో మాట చెపుతున్నారు. పవన్ స్వయంగా పోటీ చేస్తే రఘురామ కృష్ణంరాజు నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే మెజారిటీ స్థానాల్లో గెలవాలని, ఎమ్మెల్యేల బలం ఉంటేనే ప్రజలు కోరుకున్నట్టుగా పదవి చేపడుతానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆరు నెలల నుంచి జనసేనాని అన్ని రకాల వేదికల మీద ఈ అంశం బలంగా వినిపిస్తున్నారు. చంద్రబాబు జైలులో ఉన్నపుడు భేషరతుగా మద్దతు ఇవ్వటం…పొత్తుతోనే ఎన్నికలకు వెళతామని పవన్ ప్రకటించటంతో రెండు పార్టీల మధ్య సఖ్యత కుదిరింది.

వైసిపిని ఎదుర్కునేందుకు పవన్ తో జతకట్టిన తెలుగుదేశం ఇప్పుడు ఆయనను ఎలా కట్టడి చేయాలా అని ప్లాన్ వేస్తోందని తెలిసింది. పవన్ లోక్ సభకు వెళితేనే శాసనసభ స్థానాల్లో టిడిపికి అధిక స్థానాలు దక్కుతాయని బాబు, లోకేష్ ల ఆలోచనగా ఉందని అంటున్నారు. శాసనసభలో అడుగుపెట్టాలని పవన్ అనుకుంటున్నారు. సిఎం పదవి చేపట్టాలనే లక్ష్యంతో ఉన్న జనసేనాని లోక్ సభకు వెళ్లేందుకు అయిష్టత వ్యక్తం చేస్తే రాజకీయ వ్యుహకర్త ప్రశాంత కిషోర్ తో చెప్పించటం జరగాలని ప్రణాలికలు సిద్దం చేస్తున్నారట!

పవన్ లోక్ సభ బరిలో ఉంటారనే వార్తలపై జనసేన నేతలు ఖంగు తిన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుతో స్నేహం విడిచి ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే పార్టీ బలోపేతం అవుతుందని వివరిస్తున్నా పవన్ వినటం లేదని తెలిసింది. సీట్ల సర్దుబాటులో తేడాలు వస్తే ప్రత్యామ్నాయం ఆలోచన చేయలేదని జనసైనికులు మదనపడుతున్నారు. అటు బిజెపితో స్నేహం..ఇటు టిడిపితో ఎన్నికల పొత్తు రెండింటి మధ్య జనసేన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో అని పార్టీ నేతలు వర్రీ అవుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్