పావన గౌతమీ తీరం..చక్కని రాజమహేంద్రవరం
అందమైన గైట్ కళాల ప్రాంగణం….
తెలుగు భాషకు వన్నెలు దిద్దిన పెద్దలెందరో మూడు రోజులపాటు కొలువై తెలుగు తల్లికి మంగళ నీరాజనమెత్తిన వేదిక….ఆదికవి నన్నయ వేదిక
మార్గశీర్ష మాసం పౌష్యంపు మంచు తెలి వెన్నెల తెర తీస్తున్న వేళ… జనవరి 5-2024 శుక్రవారం ఉదయం గైట్ కళాశాలలో యువతరం గోదావరి తరంగాలలా వెలువెత్తుతుంటే రాజరాజనరేంద్ర ప్రాంగణంలో డా.గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో… “రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు” ప్రారరంభమయ్యాయి….. ఈ సంబరాలలో అంతర్భాగంగా ‘ఆదికవి నన్నయ వేదికపై’ పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు జ్యోతి ప్రజ్వాలనం చేసి తెలుగు భాషా సదస్సులకు నాంది పలికారు.
తొలిగా….
యువ శతావధాని, చిరంజీవి ఉప్పలదడియం భరతశర్మ అష్టావధానం కార్యక్రమానికి సంచాలకులుగా డా. కడిమిళ్ళ వరప్రసాద్ గురుసహస్రావధాని శ్రీకారం చుట్టారు. కడిమిళ్ళ మీనాక్షి, కాకరపర్తి దుర్గాప్రసాద్, కోరుప్రోలు గౌరునాయుడు, పోచినపెద్ది సుబ్రహ్మణ్యం, కోట వేంకట లక్ష్మీ నరసింహం,సలాది భాగ్యలక్ష్మి, చేగొండి సత్యనారాయణ మూర్తి, చక్రావధానుల రెడ్డప్ప ధవేజి లు పృచ్ఛకులుగా ఉప్పలధడియం భరతశర్మ గారి అవధానం వీనుల విందుగా సాగింది. భరతశర్మ గారి వేగపూరితమైన పూరణలు ముచ్చట గొలిపాయి.ముఖ్యంగా భరతశర్మ గారి పాండితీ ప్రకర్ష, వినయ విధేయతలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భరతశర్మ ధారణపటిమ అందరనూ ముగ్ధులను చేసింది. తరువాత రేవూరు అనంత పద్మనాభరావు గారి ఆధ్యక్షంలో రసరాజు, పేరి రవికుమార్, పంతుల వేంకటేశ్వరరావు,అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు గార్లు వక్తలుగా ‘పద్యసదస్సు’ ఎంతో ఉత్కంఠగా జరిగింది.
తరువాత ‘గద్య సాహిత్య సదస్సు’ లో తెలుగు సాహిత్యంలో గద్యాన్ని గద్దెనెక్కించిన వైనాన్ని అత్యంత మనోహరంగా తెలిపారు సింగం లక్ష్మీ నారాయణ, పరవస్తు ఫణిశయన సూరి ,బులుసు అపర్ణ, డా.తలారి వాసు.పద్య గద్య సమ్మిళిత విధానాన్ని ఎంతో హృద్యంగా వివరించారు వక్తలు.
ఆ తరువాత జరిగిన’అవధాన సాహిత్య సదస్సు పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి జలపాత సమవేగ ప్రసంగ మాధుర్యంతో ఆద్యంతం ఆకర్షణీయంగా సాగింది.శ్రీ చైతన్య రాజు,డా.గజల్ శ్రీనివాస్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు.
శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, కోట వేంకట లక్ష్మీ నరసింహం,తాతా సందీప్ శర్మ, ధూళిపాల మహదేవ మణి గార్ల విషయ పరిజ్ఞానంతో సదస్సు ఎంతో రసవంతంగా జరిగింది.
చివరగా ‘వాగ్గేయ కార సాహిత్య సదస్సు’ మండ సుధారాణి గారి స్వరంతో ఆలపించిన త్యాగరాజకీర్తన లతో ప్రారంభమైంది.మాశర్మ గారు నారాయణ తీర్థుల కీర్తనావైభవాన్ని ప్రస్తుతించారు. జోశ్యుల కృష్ణబాబు గారు క్షేత్రయ్య పద లాలిత్యాన్ని,పొన్నూరు వేంకట శ్రీనివాసులు గారు వాగ్గేయకారుల విశేషాలను అందించారు.
ఈ సదస్సు తో తొలినాటి కార్యక్రమం పూర్తయ్యింది.
(సశేషం)… ..
-చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ