స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం దక్కలేదు. ఆయనకు 17(ఎ) నిబంధన వర్తిస్తుందని జస్టిస్ బోస్ పేర్కొనగా, వర్తించదని జస్టిస్ త్రివేది తీర్పు చెప్పారు. రిమాండ్ విధించే అధికారం కింది కోర్టుకు ఉంటుందని, ట్రయల్ కోర్టు విచారణలో జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సిఐడి అరెస్ట్ చేసింది. 10న విజయవాడ లోని సిబిఐ కోర్టు ఎదుట హాజరుపరచగా తొలుత 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. చంద్రబాబుకు 17(ఏ) వర్తిస్తుంది కాబట్టి సిఐడి దాఖలు చేసిన రిమాండ్ చెల్లదని, దీన్ని క్వాష్ చేయాలని బాబు తరఫు న్యాయవాదులు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయగా సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
తన విచారణ విషయంలో 17(ఎ) నిబంధనను ఏపీ సిఐడి పాటించలేదని, తనపై నమోదు చేసిన రిమాండ్ నివేదికను స్క్వాష్ చేయాలని బాబు తరఫున సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తో పాటు సిద్దార్థ్ లూథ్రా… ప్రభుత్వం తరఫున ముకుల్ రోహాత్గీ ఈ కేసుపై సుప్రీం కోర్టులో తమ వాదనలు బలంగా వినిపించారు.
చంద్రబాబుకు 17(ఎ) వర్తిస్తుందని, అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ను విచారించేందుకు ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని, ఈ నిబంధనను ఏపీ సిఐడి పాటించలేదని బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిన సమయంలో 17 (ఏ) చట్టం లేదని, అయినా అవినీతిపరులకు ఈ చట్టం రక్షణ కవచం కాకూడదని రోహాత్గీ వాదించారు చంద్రబాబుకు ఈ చట్టం వర్తించదని, నిజాయతీ గలిగిన ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి మాత్రమే దీన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు.
అక్టోబర్ 17న తుదివాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసి, నేడు తీర్పు వెల్లడించింది.