Saturday, November 23, 2024
HomeTrending Newsఇది సామాజిక న్యాయ మహా శిల్పం: అంబేద్కర్ విగ్రహంపై సిఎం జగన్

ఇది సామాజిక న్యాయ మహా శిల్పం: అంబేద్కర్ విగ్రహంపై సిఎం జగన్

విజయవాడలో ఆవిష్కరిస్తోన్న 125 అడుగుల డా. బిఆర్ అంబేద్కర్ మహా శిల్పం  దేశానికే తలమానికమని, ఇది సామాజికన్యాయ మహాశిల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. గురువారం జనవరి 19న ఈ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించనున్నారు.  ఈ సందర్భంగా ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.

“విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న, అంబేద్కర్ గారి మహా శిల్పం.., మన రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం!
* ఇది, “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’! ఇది “సామాజిక న్యాయ’ మహా శిల్పం!
* ఈ నెల 19న, చారిత్రక, స్వరాజ్య మైదానంలో ఆవిష్కరించబోతున్న ఈ విగ్రహం, దేశంలోనే కాదు…, ప్రపంచంలోనే అతి పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం!
* ఇది 81 అడుగుల వేదిక మీద, ఏర్పాటు చేసిన… 125 అడుగుల మహా శిల్పం, అంటే, 206 అడుగుల ఎత్తైన విగ్రహం!
* ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం, ఈ దేశ సామాజిక; ఆర్థిక; రాజకీయ; మహిళా చరిత్రల్ని మార్చేలా, దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి!
* బాధ్యతతో, ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో.., వాటిని మన నవరత్నాల్లో, అనుసరిస్తున్న ప్రభుత్వంగా.., ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, 19వ తేదీన.., అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని కోరుతున్నాను!
* ఆయన.., అణగారిన వర్గాలకు చదువులు, దగ్గరగా తీసుకు వెళ్ళిన మహనీయుడు!
* ఆయన.., అంటరాని తనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటు చేసిన మహానుభావుడు!
* ఆయన.., సమ సమాజ భావాలకు నిలువెత్తు రూపం!
* ఆయన.., రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే ఓ మహాశక్తి!
* ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం.., అణగారిన వర్గాలకు నిరంతరం.., ధైర్యాన్ని, అండని ప్రసాదించే ఓ మహా స్ఫూర్తి!
* దళితులతోపాటు.., కులాలు, మతాలకు అతీతంగా, పేదలందరి జీవితాల్లో.., ఈ 77 సంవత్సరాల్లో వచ్చిన అనేక మార్పులకు మూలం.., డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి భావాలు!
* కాబట్టే, ఆయన్ను ఇంతగా గౌరవించుకుంటున్నాం!
* ఇప్పుడు మన విజయవాడలో, ఆవిష్కరిస్తున్న ఈ మహా శిల్పం.., మన రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటం మాత్రమే కాకుండా.., చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తి ఇస్తుంది!
* ఇది మన సమాజ గతిని, సమతా భావాల వైపు మరల్చటానికి, సంఘ సంస్కరణకు.., పెత్తందారీ భావాలమీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు, నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను!
జై హింద్” అంటూ సీఎం తన సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్