Friday, September 20, 2024
HomeTrending NewsTSPSC ఛైర్మన్ నియామకంపై అనుమానాలు..!

TSPSC ఛైర్మన్ నియామకంపై అనుమానాలు..!

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్(TSPSC) ఛైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి నియామకం దాదాపు ఖాయం అయిపొయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డిజిపిగా ఉన్న మహేందర్ రెడ్డిని ప్రభుత్వం ఎంచుకోవటంపై నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే TSPSCని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందుకోసం ఢిల్లీలో  కేంద్ర ప్రభుత్వ పెద్దలు, యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సభ్యులతో చర్చలు జరిపారు. TSPSC బలోపేతానికి కేంద్రం, మేధావుల సహకారం కావాలని, అవినీతికి ఆస్కారం లేని విధంగా తీర్చిదిద్దాలని కృత నిశ్చయంతో ఉన్నట్టు వివిధ సందర్భాల్లో సిఎం అన్నారు.

TSPSC చైర్మన్, సభ్యుల పోస్టుల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించగా 370 దరఖాస్తులు వచ్చాయి. అందులో 50 మంది చైర్మన్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పారదర్శకత పాటిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనూహ్యంగా మహేందర్ రెడ్డి పేరు ప్రతిపాదించటం కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్ లను నివ్వెరపరిచింది. మహేందర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తు చేస్తుకున్న వారిలో అర్హులు లేరా అనేది తెలియాల్సి ఉంది.

TSPSC చైర్మన్ గా మాజీ IAS ఆకునూరి మురళి, తెలంగాణ jac చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను ఎంపిక చేస్తారని కాంగ్రెస్ లో చర్చ జరిగింది. వీరు కాకపోతే మరెవరైనా సివిల్ సర్వీసు అధికారిని ఎంపిక చేస్తారని భావించారు. అందుకు భిన్నంగా గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారి, విపక్ష పార్టీకి సన్నిహితుడిగా పేరున్న మహేందర్ రెడ్డి పేరు తెరమీదకు రావటంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

మహేందర్ రెడ్డి రాష్ట్ర పోలీసు బాసుగా ఉన్న సమయంలో ఒక సామాజిక వర్గం వారికి దన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా ఉన్నపుడు తన సామాజికవర్గం వారికి ప్రాముఖ్యత కలిగిన పోస్టులు ఇచ్చారని విమర్శలు ఉన్నాయి. నయీం ఎన్‌కౌంటర్ జరిగాక అనేక అంశాలు తెరమరుగు అయ్యాయని, నయీంకు కొమ్ము కాసిన పోలీసుల పాత్ర బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియలేదనే అపవాదు ఉంది. సౌమ్యుడిగా పేరున్నా… మహేందర్ రెడ్డి డిజిపిగా ఉన్నపుడే నయీం కేసు విచారణ నత్త నడకన సాగిందని ఆరోపణలు ఉన్నాయి.

గత ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా బందు వర్గానికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చుకొని, పని చేయకుండానే జీతాలు ఇచ్చిందనే అంశాలు వెలుగు చూశాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నియామకం అదే కోవలో ఒక సామాజికవర్గానికి మేలు చేస్తుందని నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ వారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చేందుకు TSPSC ఓ మార్గంగా మారిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు చేపట్టిన నియామకాలకు ఎవరు వంక పెట్టలేకపోయారు. మొదటిసారి TSPSC పై నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పారదర్శకత పాటిస్తామని చెపుతున్నా…ఆచరణ భిన్నంగా ఉందని అంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇస్తేనే నిరుద్యోగుల్లో అనుమానాలు తొలగుతాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్