Saturday, September 21, 2024
HomeTrending Newsబాబు స్క్రిప్టు ప్రకారమే షర్మిల వ్యాఖ్యలు: సజ్జల

బాబు స్క్రిప్టు ప్రకారమే షర్మిల వ్యాఖ్యలు: సజ్జల

వైఎస్ షర్మిల వైఎస్సార్టీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే మణిపూర్ ఘటన జరిగిందని, ఆ సమయంలో ఆమె ఎందుకు స్పందించలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఓ వైపు అందరూ కలుస్తున్నారని.. మరో వైపు వైసీపీకి గంపగుత్తగా ఉన్న ముస్లిం మైనార్టీలు, క్రైస్తవుల ఓట్లకు గండి కొట్టడానికే షర్మిలను ప్రయోగించినట్లు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.  చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే ఆమె మాట్లాడుతున్నారన్నారు.  ఏపీ రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని, ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడంలేదని విమర్శించారు. ఆమె చేసే ప్రతి మాటకూ స్పందించాల్సిన అవసరం లేదన్నారు. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

తనకు అన్యాయం జరిగిందని షర్మిల చెబుతున్నారని, పార్టీలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడం సాధ్యం కాకపోవచ్చని…. నిన్నటి వరకూ ఆమె సొంత పార్టీలో ఉన్న, ఆమె వెంట నడిచిన ప్రతి నాయకుడికీ షర్మిల న్యాయం చేయగలిగారా అని సజ్జల నిలదీశారు. ఆమెకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు. పార్టీ కోసం ఆమె ఒక్కరే కాదని, ఎంతోమంది కష్టపడ్డారన్నారు. వైఎస్సార్ ను ప్రేమించిన ప్రతి గుండె జగన్ ను ఆదరించారన్నారు.  కార్యకర్తల్లో గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే షర్మిల చేస్తోన్న అసంబద్ధ, డొల్ల వ్యాఖ్యలపై  స్పందిచాల్సి వస్తోందన్నారు.

జగన్ అంతు చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసిందని, అక్రమ కేసులతో 16 నెలలపాటు జైల్లో కూడా పెట్టిందని, తెలంగాణలో ఉన్నపుడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన ఆమె ఇప్పుడు అదే పార్టీలో చేరారన్నారు.  వైఎస్సార్ బిడ్డగా, జగన్ సోదరిగానే ఆమెకు కాంగ్రెస్ ఈ పదవి అప్పగించిందని, పదవి వచ్చిన వెంటనే ఆమె తమపై విమర్శనాలకు పదును పెంచారని సజ్జల అసహనం వెలిబుచ్చారు.

ప్రత్యేక హోదా గురించి సిఎం జగన్ అడుగుతూనే ఉన్నారని, పోరాటం అంటే దాని స్వరూపం ఏమిటని, ప్రధాని సమక్షంలోనే బహిరంగ సభలోనే ఈ విషయం ప్రస్తావించారని గుర్తు చేశారు. గంగవరం పోర్టు విషయంలో కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్