జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవం రోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తు ధర్మం విస్మరించి మండపేట, అరకులో టిడిపి అభ్యర్థులను ప్రకటించటంతో ఈ నిర్ణయం తీసుకోవల్సి వచ్చిందని వెల్లడించారు. “నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ప్రత్యేక పరిస్థితులు ఉండి ఉంటాయి. గబుక్కున్న ఒక మాట అనేలా చేస్తుంది. అది మనం అర్ధం చేసుకోవాలని” పవన్ చురకలు అంటించారు.
రాబోయే శాసనసభ ఎన్నికల్లో జనసేన తన వాటా ప్రకారం సుమారు 50 స్థానాల్లో పోటీ చేస్తుందని సంకేతాలిచ్చింది. పొత్తుల్లో సమస్యలు ఉన్నా సర్డుకుపోతామని తేల్చి చెప్పారు. పవన్ నైజం చూస్తుంటే పొత్తుల్లో రాజీ పడేట్టుగా కనిపించటం లేదు. ఇటీవల మీడియాలో జనసేనకు 25 నుంచి 30 సీట్లు అని ప్రచారం జరిగింది. కేవలం అది ప్రచారమే అని పవన్ వ్యాఖ్యలతో తేలిపోయింది.
ముఖ్యమంత్రి పదవి విషయంలో లోకేష్ వ్యాఖ్యలను ఉటంకించిన పవన్… సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటామనే రీతిలో స్పందించారు. జనసేన ఓటుబ్యాంక్ వాడుకుని తక్కువ సీట్లతో సరిపెడదామని చూస్తున్న టిడిపి నేతలు పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో కంగుతున్నారు.
జనసేన వైఖరితో ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని తెలుగుదేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ జిల్లాల్లో ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్ర, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి ఉమ్మడి జిల్లాల పరిధిలో జనసేన అధికంగా స్థానాలు అడిగే అవకాశం ఉంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మెజారిటి స్థానాలు దక్కించుకునే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సీట్ల ఖరారు ఏ విధంగా జరుగనుందోనని తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. బిజెపితో పొత్తుపై చర్చలు జరుపుతారని సమాచారం. టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేలా చర్చలు జరుగనున్నాయని ఢిల్లీ బిజెపి వర్గాలు అంటున్నాయి.
-దేశవేని భాస్కర్