రాయలసీమ ప్రాంతాన్ని సిఎం జగన్ తీవ్రంగా నిర్లక్యం చేశారని, ఇక్కడి నీటిపారుదల ప్రాజెక్టులను 80 శాతం వరకూ తాము పూర్తి చేస్తే మిగిలిన భాగాన్ని పూర్తి చేయలేకపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఇళ్ళు కోల్పోయిన వారికి ఇళ్ళు కూడా నిర్మించి ఇవ్వలేకపోయారని, కనీసం ఆ ప్రాజెక్టులు గ్రీజు కూడా రాయలేకపోయారని విమర్శించారు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో జగన్ ఆరితెరారని అదే ఆయన విధానమని దుయ్యబట్టారు. పీలేరులో జరిగిన ‘రా కదలిరా’ బహిరంగసభలో బాబు పాల్గొన్నారు.
నాలుగేళ్ళుగా ఇదే రాష్ట్రం-ఇదే ప్రజలని.. మారింది కేవలం ప్రభుత్వమేనని, నాడు లేని పన్నులు నేడు ఎలా పెరిగాయని, నాడు లేని అప్పుడు నేడు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు ఐదు రేట్లు పెంచారని, పేదలపై భారం మోపారన్నారు. గతంలో 60 రూపాయలుగా ఉన్న క్వార్టర్ మద్యం బాటిల్ ఇప్పుడు 200 కు పెంచారన్నారు.
జగన్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని… ప్రజాకోర్టులో వైసీపీకి శిక్ష తప్పదని బాబు హెచ్చరించారు. రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం వాల్ల 35 లక్షల మంది అనారోగ్యంపాలయ్యారని, 30 వేలమంది మరణించారని వెల్లడించారు. మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 30 వేల కోట్ల రూపాయల ఋణం తీసుకున్నారని, మరో 20 ఏళ్ళపాటు ఈ అప్పు కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొన్నటి వరకూ 175 అన్నారని, వై నాట్ కుప్పం అన్నారని… కానీ తాము వై నాట్ పులివెందుల అంటున్నామన్నారు.
వైసీపీ చేపట్టిన సిద్ధం కార్యక్రమంపై కూడా చంద్రబాబు స్పందించారు. ఎన్నికలప్పుడే జగన్ ప్రజల్లోకి వస్తారని, ఆయన్ను ఓడించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని, ఇంటికి పంపడానికి అన్నదాత, కసితో తరిమి కొట్టడానికి యువత సిద్ధంగా ఉన్నారని…’నీ అధికార అహంభావాన్ని దించడానికి ఉద్యోగస్తులు కూడా సిద్ధంగా ఉన్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.