Friday, November 22, 2024
HomeTrending Newsకుప్పంలో CBNకు ఎదురు గాలి

కుప్పంలో CBNకు ఎదురు గాలి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు 2024 శాసనసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వేయని ఎత్తుగడ లేదు. రాష్ట్రంలో పార్టీ గెలుపు కోసం కాలికి బలపం పెట్టుకొని మరి తిరుగుతున్న బాబుకు కుప్పంలో కష్టాలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.

కుప్పం నియోజకవర్గంలో కుప్పం పురపాలక సంఘం, కుప్పం మండలం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం  మండలాలు ఉండగా సుమారు 2 లక్షల 15 వేల ఓటర్లు ఉన్నారు. 1989 నుంచి చంద్రబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనతో కుప్పంలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగు చూశాయి. చెన్నై, బెంగలూరు, హైదరాబాద్ లో ఉంటున్నవారి ఓట్లతో ఈ దఫా బాబుకు తిప్పలు తప్పవు. నియోజకవర్గంలో సుమారు 45 వేల దొంగ ఓట్లు జాబితా నుంచి తొలగించారని సమాచారం.

రామకుప్పం మండలంలో మాత్రమె టిడిపి అనుకూల ఓట్లు, బాబు సామాజిక వర్గం బలంగా ఉందని మిగతా ప్రాంతాల్లో ఇరు పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలుగు దేశం చేపట్టిన అంతర్గత సర్వేల్లో వెలుగు చూసినట్టు విశ్వసనీయ సమాచారం.

దివంగత ముఖ్యమంత్రి ys రాజశేఖర్ రెడ్డి హయంలో చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి చేపట్టారు. ఇందులో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా నియోజకవర్గానికి సాగునీరు తీసుకొస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అది నెరవేర్చలేదు. పైగా 293 కోట్ల పనుల అంచనా వ్యయం పెంచి 413 కోట్లకు పెంచి అనుమాయులకు అప్పగించారు. మొదట ఆర్కె ఇన్ఫ్రాకు ఆ తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ కు అప్పచెప్పి ప్రభుత్వం దిగే నాటికి బిల్లులు మొత్తం చేల్లిచారు. పనులు మాత్రం జరగలేదు.

కుప్పం ప్రజల చిరకాల కల హంద్రీనీవా కాలువ జగన్ ప్రభుత్వంలో నెరవేరింది. 74 కిలోమీటర్ల పనులు చేసి రామకుప్పం మండలంలోని మనేంద్రం వరకు ఇప్పటికే సాగునీరు ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గానికి సాగునీటి కొరత తీర్చే ఈ కాలువను అధికారికంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నారు. కుప్పం మండలం గణేష్ పురం వద్ద పాలారు నదిపై YSR హయంలో 0.06 TMCల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం జరగకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఎమ్మెల్యేగా దశాబ్దాలుగా గెలుస్తున్న బాబు ప్రజలకు అందుబాటులో ఉండరని అపవాదు ఉంది. ఆయన అనుచరగణం ఇష్టానుసారం నియోజకవర్గంలో పనులు జరుగుతాయని ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీస్తోందని అంటున్నారు. ఎమ్మెల్సీ, చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు KRJ భరత్ YSRCP అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు. కుప్పంతో పాటు మరో స్థానం కోసం పార్టీ నేతలు వెతుకుతున్నారు. ఇందుకోసం  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వివిధ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్