Saturday, November 23, 2024
HomeTrending Newsలాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం

లాల్ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా వెల్లడించారు. అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అద్వానీకి ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (శనివారం) ప్రకటించారు. ఎల్‌కే అద్వానీ జీకి భారతరత్న ఇవ్వటం.. ఆ అంశాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు.

ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన 97 ఏళ్ళ అద్వానీ పార్లమెంటు ప్రస్తావనల్లో ఎప్పటికీ గుర్తుండిపోతారని ప్రశంసించారు. పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రిగా దేశానికి సేవ చేయడం వరకు అతని జీవితం స్పూర్తి దాయకం. మన హోం మంత్రిగా, I&B మంత్రిగా విశేష సేవలు అందించి గుర్తింపు పొందారని ప్రధాని ప్రశంసించారు.

1927 జూన్ 8వ తేదిన పాకిస్తాన్ లోని సింద్ రాష్ట్రం కరాచీ నగరంలోని సంపన్న సింధీ వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే ఆర్.ఎస్.ఎస్.లో ప్రవేశించారు. దేశ విభిజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి దేశ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలినాళ్ళలో జనసంఘ్ లో చురుకుగా వ్యవహరించారు. బిజెపి సహ వ్యవస్థాపకులలో ఒకరు అద్వాని.

1990ల్లో రామజన్మ భూమి అంశాన్ని రథయాత్ర ద్వారా దేశవ్యాప్తం చేసి రెండు ఎంపి స్థానాల నుంచి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేసిన అద్వాని దేశ రాజకీయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.

రథయాత్ర సోమనాథ్‌లో ప్రారంభమై… అయోధ్యలో ముగియాల్సి ఉంది. అయితే మత హింస రాజుకుంటుందనే కారణంతో  అప్పటి బిహార్ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని బీహార్‌లో అరెస్టు చేయించారు.

అత్యధిక కాలం హోం వ్యవహారాల మంత్రిగా పనిచేసిన అద్వానీ లోక్‌సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన నేతగా పేరొందారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి అద్వానీ. 1999లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.

2005లో పాకిస్తాన్ పర్యటనలో భాగంగా తన జన్మస్థలమైన కరాచీని అద్వాని సందర్శించారు. మహ్మద్ ఆలీ జిన్నాను ప్రశంసిస్తూ జిన్నా గొప్ప వ్యక్తి.. నిజమైన లౌకికవాది అంటూ కరాచీలోని జిన్నా సమాధిని సందర్శించిన సందర్భంలో ఎల్‌కే అద్వానీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్నేసృష్టించాయి.

1947 ఆగస్టు 11న పాకిస్తాన్ పార్లమెంట్‌లో జిన్నా చేసిన ప్రసంగాన్ని ప్రశంసించారు. పాక్ నుంచి తిరిగొచ్చిన అద్వానీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోడానికి నిరాకరించడంతోపాటు అవసరమైతే పార్టీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఒక విధంగా చెప్పాలంటే జిన్నా హిందూ-ముస్లిం యూనిటీకి అంబాసిడర్ అంటూ అద్వానీ తన పుస్తకంలో రాశారు. హిందుత్వ సిద్ధాంతాల్లో పుట్టిపెరిగి, సుదీర్ఘకాలం బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ ఆనాడు మహ్మద్ ఆలీని పొగడడం ఊహించని పరిణామం. అప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌కు అద్వానీకి మధ్య దూరం పెంచేసిందని అంటారు.

బిజెపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రపతి పదవి అద్వానికి రాకపోవటం…ఒక విధంగా కరాచీలో వ్యాఖ్యలే కారణమని కాషాయ నేతలు చెపుతుంటారు. అయోధ్య ఆలయం ప్రారంభోత్సవానికి అద్వానికి ఆహ్వానం అందకపోవటంతో హిందుత్వవాదుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అద్వాని, మురళి మనోహర్ జోషిని ఆహ్వానించాలని డిమాండ్లు వచ్చాయి. వయోభారం రిత్యా వారు రాలేకపోయారని అయోధ్య ట్రస్ట్ వివరణ ఇచ్చింది.  భారతరత్న ప్రకటించటంతో వారందరినీ సంతృప్తి పరిచినట్టయింది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్