చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి హస్తిన పర్యటనకు వచ్చిన బాబు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలతో భేటీ అయ్యారు.
రాబోయే ఎన్నికల్లో పొత్తు కోసమే చర్చలు జరిగాయని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. కలిసి పోటీ చేయకపోతే ఎన్నికల తర్వాత కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం దిశగా మంతనాలు సాగాయని సమాచారం.
బాబు అరెస్టు సమయంలోనే బిజెపి- టిడిపిల మధ్య అవగాహన కుదిరిందని.. దానికి కొనసాగింపుగానే బాబు ఢిల్లీ పర్యటన అనే టాక్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం వరకు టిడిపి-బిజెపిల పొత్తు ప్రతిసారి విజయవంతం అయింది.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బిజెపి ఏ అవకాశాన్ని వదులుకోవటం లేదు. NDAలో బలమైన మిత్రపక్షాలు లేకపోవటం లోటుగా ఉంది. దీంతో ఉత్తరప్రదేశ్ లో RLD, బీహార్ లో జెడి(యు), ఏపిలో టిడిపితో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు మోడీ త్రయం కసరత్తు చేస్తోంది.
గతంలో టిడిపి చెప్పినట్టుగా సీట్ల ఖరారు జరిగేది. వాజపాయి హయంలో చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. మారిన రాజకీయ పరిణామాల్లో మోడీ చెప్పినట్టుగా బాబు వినాల్సిన రోజులు వచ్చాయి.
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ మేయర్ ఎన్నికల్లో టిడిపి రెండు సీట్లు గెలుచుకుంది. అయినా సరే మేయర్ పదవిని టిడిపికి కట్టబెట్టింది బిజెపి. భవిష్యత్ అవసరాల కోసమే బిజెపి త్యాగం చేసిందని ఏపి కమలం నేతలు వివరిస్తున్నారు.
జనసేన 50 శాసనసభ సీట్ల వరకు కోరుతోంది. సుమారు 25 వరకు ఫైనల్ కావొచ్చని టిడిపి వర్గాల అంచనా. బిజెపితో పొత్తులు ఫైనల్ అయితే ఆ పార్టీకి 15 వరకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. రెండు పార్టీలకు చెరో రెండు ఎంపి స్థానాలు ఇవ్వాలని నేతలు ఒత్తిడి చేస్తున్నారు. జనసేనతో ఇబ్బంది లేకపోయినా బిజెపి ఎంపి స్థానాలు అధికంగా కోరే అవకాశం ఉంది.
గతంలో గెలిచిన నరసాపురం, విశాఖపట్నంతో పాటు రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, రాజంపేట స్థానాలను బిజెపి డిమాండ్ చేస్తోంది. అధికారంలోకి రావటమే లక్ష్యంగా రాజకీయాలు చేసే చంద్రబాబు సమయానుకూలంగా నిర్ణయం తీసుకోనున్నారు.
గురువారం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పయనం అవుతున్నారు. రెండో రోజు పర్యటనలో బాబు…పవన్ తో కలిసి బిజెపి నేతలతో సమావేశం కానున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురుంధేశ్వరిని ఢిల్లీకి రావాలని అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది. తాజా రాజకీయ పరిస్థితులు పరిశీలిస్తే రెండు రోజుల్లో పొత్తులు కొలిక్కి రానున్నాయి.
జనసేన, బిజెపిలతో పొత్తుల పర్యవసానం… సుమారు 40 శాసనసభ స్థానాలు టిడిపికి తగ్గనున్నాయి. ఎవరి సీట్లు గల్లంతు అవుతాయోనని తెలుగు తమ్ముళ్ళలో ఆందోళన నెలకొంది.
-దేశవేని భాస్కర్