ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి చేరుకున్నాయి. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడేందుకు జరుగుతున్న చర్చలు మలిదశకు చేరుకున్నాయి. పొత్తుల వైపు మొగ్గేందుకు మూడు పార్టీల్లో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అయిదేళ్ళు అధికారానికి దూరంగా ఉండటం.. ఈ దఫా గెలవకపోతే రాజకీయంగా మనుగడ కష్టమనే భావనలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జనసేనతో పొత్తుల్లో శాసనసభ సీట్లు కీలకంగా మారాయి. జనసేన 50 వరకు డిమాండ్ చేస్తుండగా 25 MLA, 2 ఎంపి సీట్లకు ఒప్పించే దిశగా చర్చలు జరుగుతున్నాయి.
ఈ తరుణంలో బిజెపి నుంచి పిలుపు రావటంతో బాబు ఢిల్లీ పయనం అయ్యారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన బాబు.. కమలనాథులతో చర్చోపచర్చలు జరుపుతున్నారు. గతంలో అనేకమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యక్తగత విమర్శలకు దిగిన చంద్రబాబు ఇప్పుడు స్నేహం చేయటం గమనార్హం.
బిజెపితో పొత్తులు ఫైనల్ అయితే ఆ పార్టీ సుమారు ఆరు సీట్లు కోరే అవకాశం ఉందని తెలిసింది. గతంలో ప్రాతినిధ్యం వహించిన నరసాపురం, విశాఖపట్నంలతో పాటు రాజమండ్రి, తిరుపతి, ఒంగోలు, రాజంపేట స్థానాలను కోరుతోందని తెలిసింది. 10 నుంచి 15 వరకు ఎమ్మెల్యే సీట్లు అడిగినట్లు సమాచారం.
అయితే చంద్రబాబు వైఖరితో మరోసారి మైనారిటీలు దూరం అయ్యే ప్రమాదం ఉందని తెలుగుదేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం, క్రైస్తవ ఓటర్లు ప్రభావిత వర్గంగా ఉన్నారు. బిజెపితో పొత్తు ద్వారా ఈ వర్గాలు ఆదరిస్తాయా అనే అనుమానం టిడిపి నేతలు వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు సరైన అభ్యర్థులు లేకపోయినా 50 సీట్లు కోరటం తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది.
జనసేనకు కేటాయించిన సీట్లలో మెజారిటీగా వైసిపి ఖాతాలో పడతాయని తెలుగు తమ్ముళ్ళు తలపట్టుకుంటున్నారు. దీనికి విరుగుడుగా హైదరాబాద్ కూకట్ పల్లి విధానం అవలంభించాలని బాబుకు సూచిస్తున్నారు. బిజెపి – జనసేన పొత్తుల్లో కూకట్ పల్లి జనసేనకు రాగా బిజెపి నుంచి ఆ పార్టీలో చేరిన ముమ్మారేడ్డి ప్రేమ కుమార్ ను అభ్యర్థిగా నిలిపారు. ఏపి శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములా పాటించాలని.. లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం నేతలు బాబు, లోకేష్ లకు వివరిస్తున్నారు.
చంద్రబాబు 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళారు. 2023లో కూడా పొత్తుల కోసం ప్రయత్నించినా కాంగ్రెస్ సున్నితంగా తిరస్కరించింది. అదే కాంగ్రెస్ రాష్ట్రంలో పొత్తుల కోసం సంప్రదిస్తే చంద్రబాబు, లోకేష్ లు కనీసం స్పందించటం లేదని హస్తం నేతలు వాపోతున్నారు.
బాబు జైలులో ఉన్నపుడు నైతిక మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ను వదిలేసి బిజెపితో ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని హస్తం నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ విలువలు పాటించని చంద్రబాబుకు ప్రజలే బుద్ది చెపుతారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-దేశవేని భాస్కర్