కృష్ణా ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు బలంగా వినిపించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా రాజకీయాలు చేస్తోందని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ దుయ్యబట్టారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టును అప్పగిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకాలు పెట్టి వచ్చారని అన్నారు. ‘తన కట్టే కాలే వరకూ, చివరి శ్వాస వరకూ తెలంగాణకు అన్యాయం జరిగితే పులిలాగా కొట్లాడతా కానీ పిల్లి లాగా ఉండబోను, తెలంగాణకు అన్యాయం జరగనీయను’ అని స్పష్టం చేశారు.
ప్రజలు పాలిచ్చే బర్రెను కాదని, దున్నపోతును తెచ్చుకున్నారని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. తాము ఛలో నల్గొండకు పిలుపు ఇస్తే ఆ తర్వాత హడావుడిగా కృష్ణా నీళ్ళపై అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. బడ్జెట్ పక్కన పెట్టి కెఆర్ఎంబిపై తెలివి తక్కువ తీర్మానం చేశారని ఫైర్ అయ్యారు. అవసరమైనప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలని, అప్పుడే మన హక్కులు కాపాడుకోగలుగుతామని పిలుపు ఇచ్చారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం కంటే నాలుగు మంచి పనులు చేయాలని, పొద్దున్న లేచిన దగ్గరినుంచి కేసిఆర్ ను తిడితే ఉపయోగం ఏమిటని, తనను తిడితే పెద్దవాళ్ళు అవుతారా అని నిలదీశారు. అధికారం కంటే తెలంగాణా వాటా ముఖ్యమని, దానికోసం అధికారం ఉన్నా లేకున్నా వాటికోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. తాము అధికారం నుంచి దిగిపోగానే విద్యుత్ సమస్యలు వస్తున్నాయని ఇది దద్దమ్మల ప్రభుత్వమని అన్నారు. ఛలో నల్గొండతోనే తమ ఆందోళన ఆపబోమని, కరెంటు, నీళ్ళ విషయంలో ప్రజలకు అన్యాయం చేస్తే ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు.
రైతు బంధు అడిగితే చెప్పుతో కడతామంటూ అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కేసిఆర్ తీవ్రంగా స్పందించారు. రైతులకు కూడా చెప్పులు ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. మేడిగడ్డకు పోయి ఏం చేస్తారని, కేసిఆర్ ను బద్నాం చేయాలన్న ఉద్దేశంతో రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఇది చిల్లర రాజకీయమని… త్వరలో తాము కూడా అక్కడకు వెళ్లి ఈ ప్రభుత్వ బండారం బైటపెడతామని చెప్పారు. తాము డబుల్ స్పీడ్ తో మళ్ళీ అధికారంలోకి వస్తామని, తాము అపుడు ఇలాగే బిహేవ్ చేస్తే పరిస్థితి ఏమిటని అడిగారు.కృష్ణానదిలో మన వాటా మనకు దక్కేవరకూ, ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి, బడ్జెట్ సమావేశాలుముగించి వెంటనే అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నివేదిక ఆరు నెలల్లో వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.