ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 26న కుప్పంలో పర్యటించి హంద్రీ-నీవా జలాలను నియోజకవర్గానికి అందించే పథకాన్ని ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పద్నాలుగేళ్ళపాటు సిఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి కూడా సాగు, తాగునీరు ఇవ్వలేకపోయారని, రాష్ట్రంలో ప్రజలకు పనికి వచ్చే ఒక్క పనీ ఆయన చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు జరగనున్న ‘సిద్ధం’ బహిరంగసభ ఏర్పాట్లను మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి పెద్దిరెడ్డి పరిశీలించారు. రేపటి సభ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద సభ అవుతుందని, వైసీపీ శ్రేణులకు, ప్రజలకు ఓ సందేశాన్ని జగన్ ఇస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికలకు కేడర్ ను సన్నద్ధం చేస్తుందని, వైసీపీ ప్రచారం కూడా ఊపందుకుంటుందని పేర్కొన్నారు. రేపటి సభతో మూడు ప్రాంతాల్లో సభలు పూర్తవుతాయని, నాలుగో సభ పల్నాడులో త్వరలో నిర్వహిస్తామని తెలిపారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెల్చుకున్నామని, వచ్చేఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువే సాధిస్తామని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదని, ఇంకా ఆ పార్టీలో మిగిలిన కొద్దిమంది చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని పెద్దిరెడ్డి విమర్శించారు.