తెలుగులో ఈ వారం థియేటర్లకు వస్తున్నవి బడ్జెట్ పరంగా చూసుకుంటే చిన్న సినిమాలే. ఇక కంటెంట్ ను బట్టి అవి థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించవలసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక సినిమా అందరిలో చాలా ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్స్ దగ్గర నుంచే అందరిలో ఒక రకమైన ఉత్కంఠను పెంచుతోంది. ఈ వారం తప్పకుండా చూడవలసిందే అనే ఒక ఆలోచనను కలిగిస్తున్న ఆ సినిమా పేరే ‘భ్రమయుగం’.
మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మలయాళంలో ఈ నెల 15వ తేదీన విడుదలైంది. మమ్ముట్టి వైవిధ్యభరితమైన లుక్ తో కనిపించడం .. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్ లో తీయడం అందరినీ ఆకర్షించడంలో ప్రధానమైన పాత్రను పోషించింది. కథాకథనాల పరంగా కూడా ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయింది. బాక్సాఫీస్ నుంచి భారీ వసూళ్లను రాబడుతోంది. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలను అందుకుంటోంది.
రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 23వ తేదీన తెలుగులో విడుదల చేస్తున్నారు. సితార బ్యానర్ వారు తెలుగు హక్కులను తీసుకుని ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. కథానాయకుడు ఉంటున్న పాత బంగ్లాకి అతిథిగా వచ్చిన ఒక వ్యక్తి, ఇక అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. అందుకు కారణం ఏమిటి? అనే అంశం చుట్టూ తిరిగే హారర్ థ్రిల్లర్ ఇది. ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాల అనువాదాలను ఇక్కడి ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. అందువలన ఈ సినిమాకి కూడా ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.