ఐదేళ్ళ కాలంలో 25 లక్షల మందికి పక్కా ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీఇచ్చిన సిఎం జగన్ ఇప్పటివరకూ కనీసం ఐదు లక్షల ఇళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారని టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఇచ్చిన హామీలో 25 శాతం కూడా అమలు చేయలేక పోయారన్నారు. పక్కా గృహ నిర్మాణ పథకం పక్కా స్కాంగా మారిందన్నారు. ఇప్పటికే ఇళ్ళు నిర్మించుకున్న వారికి ఓటీఎస్ కింద క్రమబద్ధీకరణ పేరుతో ఒక్కొక్కరి నుంచి పది వేల నుంచి 30 వేల వరకూ బలవంతంగా డబ్బులు వసూలు చేశారని విమర్శించారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు పాలనలో టిడ్కో ఇళ్ళ పేరుతో 2 లక్షల 60 వేల ఇళ్ళు 90 శాతం పూర్తి చేశారని, వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ వాటిని అందజేయకుండా, లబ్దిదారులను వీధిన పడేశారని కనకమేడల పేర్కొన్నారు. సెంటు భూమి పంపిణీ అంటూ గుంటల్లో, చెరువుల్లో, వర్షం వస్తే మునిగిపోయే ప్రాతాలలో పేదలకు పట్టాలు ఇచ్చారని.. ఇళ్ళు నిర్మించుకోవడానికి అనువుగా లేని ప్రాంతాల్లో ఒక సెంటు భూమి ఇచ్చి మోసం చేశారని అన్నారు. ఈ భూములను సేకరించడం, వాటిని అభివృద్ధి చేసే పేరుతో కూడా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ చేశారు.
జగనన్న కాలనీల పేరుతో చెరువులు, అసైన్డ్ భూములను కబ్జాచేశారని…. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పేదలను మోసం చేశారన్నారు రవీంద్ర కుమార్. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా 85 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తామే ఇస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటూ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తోందని, కోట్లాది రూపాయలు ప్రకటనలు ఇస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని కనకమేడల అభ్యంతరం వెలిబుచ్చారు.