వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, వరుణ్ జోడీగా మానుషి చిల్లర్ నటించింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాను సోని – రిలయన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో నడిచే కథ. తీవ్రవాద స్థావరాలను నాశనం చేయడమే హీరో లక్ష్యం. కథ ప్రకారం ‘వాలెంటైన్స్ డే’ రోజున జరిగే ఆపరేషన్ ఇది .. అందుకే ఈ టైటిల్.
ఈ సినిమాలో కథానాయకుడికి కాస్త ఆవేశం ఎక్కువ. అన్నివేళలా అది మంచిది కాదని అతని పై అధికారులు హెచ్చరిస్తూ ఉంటారు. కొన్ని సమయాల్లో అది అవసరమేననేది హీరో వాదన. అలాంటి హీరోకి పైఅధికారులు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ను అప్పగిస్తారు. ఆ మిషన్ ను అతను ఎలా పూర్తిచేశాడనేదే కథ. యాక్షన్ కంటెంట్ ను ఎక్కువగా ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చొచ్చు. కానీ మిగతావారికి ఆ స్థాయిలో కనెక్ట్ అవుతుందని చెప్పలేం.
యాక్షన్ కంటెంట్ వరకూ ఈ సినిమాకి వంక బెట్టనవసరం లేదు. కానీ ఆడియన్స్ ను కదలకుండా కూర్చోబెట్టడానికీ, వాళ్లు ఎంజాయ్ చేయడానికి అది మాత్రమే సరిపోదు. ప్రధానమైన కథాంశం యాక్షన్ తో కూడినదే అయినా, మిగతా వైపుల నుంచి ఆడియన్స్ కి నచ్చే ఇతర అంశాలు ఉండవలసిందే .. సమపాళ్లలో సర్దవలసిందే. లేదంటే తాళింపు లేని వంటకాల మాదిరిగానే ఉంటుంది. దర్శకుడు ప్రధానమైన కథను ఇతర అంశాలను జోడిస్తూ చెప్పినట్టయితే, ఈ సినిమా మరింత బెటర్ గా అనిపించేదేమో.