కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు వేలాది మందిని ఈ ప్రక్రియలో తీర్చిదిద్దిన మండ సుధారాణికి కేంద్ర సంగీత, నాటక అకాడమీ 2022 సంవత్సరానికి గాను అకాడమీ పురస్కారం ప్రకటించింది. 1964 జనవరి 19న ఏవీ రమణమూర్తి, కల్యాణి దంపతులకు జన్మించిన సుధారాణి విజయనగరం మహారాజ కాలేజీలో బిఎస్సీ (మ్యాథ్స్)పూర్తి చేశారు. 1984లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి సంగీతంలో డిప్లొమా చేసి, 1993 లో అదే యూనివర్సిటీ నుంచి ఎంఏ సంగీతం కోర్సు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. 1989లో మండ రామప్రసాద్ తో ఆమె వివాహం జరిగింది.
తొలి దశలో రంగాచార్యులు, శేషుమణి గార్ల వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న సుధారాణి ప్రతిభను గుర్తించిన
శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు ఆమెను కర్నాటక సంగీతంలో తీర్చిదిద్దారు. ఇవటూరి వారు విజయనగరంకు చెందిన సంగీత జ్ఞాని శ్రీ ద్వారం నరసింగారావునాయుడు గారి శిష్యుడు కావడం గమనార్హం. పల్లవి, షట్కాలపల్లవి, తాళ అవధానం ప్రక్రియల్లో ఆమె విశేషమైన ప్రతిభ చూపి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. విశాఖ, మద్రాసు మ్యూజిక్ అకాడమీల నుంచి ఆరుసార్లు అవార్డు అందుకున్న ఆమె…. 2018లో మైసూరు దత్త పీఠం ఆస్థాన విదుషిగా కూడా వ్యవహరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కలిపి వేలాది ప్రదర్శనలు ఇస్తూ సంగీత సరస్వతి ఆరాధనలో తరిస్తున్నారు.
వృత్తిరీత్యా వైద్యుడైన తన భర్త రామ ప్రసాద్ తో కలిసి హంస (HAMSA Academy of Music, Scriptures and Arts) అనే సంస్థను కూడా సుధారాణి నెలకొల్పారు. వృత్తిరీత్యా వైద్యుడైన రామప్రసాద్ స్వతహాగా కవి, సంగీతాభిమాని కూడా కావడంతో కుటుంబపరంగా ఆమెకు ఎంతో ప్రోత్సాహం లభించింది. ప్రస్తుతం హంస సంస్థకు సుధారాణి సోర్స్ పర్సన్ (మ్యూజిక్) గా వ్యవహరిస్తున్నారు. వీరి కుమార్తె ఎంపి శృతి రవళి సుప్రసిద్ధ వోకల్ ఆర్టిస్ట్. వీరి శిష్యులలో ఒకరైన డా. కొల్లూరు వందన గారు తిరుపతి సంగీత కళాశాలలో అధ్యాపకురానిగా పనిచేస్తూ జనవరి 16న లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయంలో మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సమక్షంలో సంగీత కచ్చేరి చేశారు.
శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి, జిజ్ఞాస ఉన్నవారిని ప్రోత్సహిస్తూ వారి ప్రతిభకు సానబెట్టడంలో హంస సంస్థ విశేషమైన కృషి చేస్తోంది. సంగీతంలో మెళకువలు నేర్పడంతో పాటు…. దేశభక్తి ఆలోచనలు, సమాజం పట్ల బాధ్యాతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని కూడా సుధారాణి తన శిష్యులకు బోధిస్తుంటారు. యోగా, సంగీత సాధన, భాషపై పట్టు లాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై ఆమె ఇచ్చే శిక్షణ ద్వారా వేలాది మంది ఈ సంగీత రంగంలో నిష్ణాతులై జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జించారు.
సంగీతం అనేది కేవలం ఓ వృత్తిగానో, జీవానాధారం కోసమో, కాలక్షేపం కోసమో కాకుండా ఓ జీవన విధానంగా చేసుకొని… తన కుటుంబాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ శాస్త్రీయ సంగీతం…. ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి అంకిత భావంతో కృషి చేస్తున్నారు మండ సుధారాణి. ఇప్పటికే ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్న ఆమె సేవలను కేంద్ర సంస్కృతిక శాఖ గుర్తించి సంగీత నాటక అకాడమీ ద్వారా అందించే ఈ పురస్కారం ఆమెకు ప్రకటించడంపై పలువురు సాహిత్య, సంగీతాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 6న ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం అందజేస్తారు.