Saturday, July 27, 2024
HomeTrending Newsపాకిస్తాన్ లో మరో కీలుబొమ్మ ప్రభుత్వం

పాకిస్తాన్ లో మరో కీలుబొమ్మ ప్రభుత్వం

పాకిస్తాన్ ప్రధానమంత్రిగా PML(N)నేత షహబాజ్ షరీఫ్ ఎన్నికయ్యారు. జాతీయ అసెంబ్లీలో ఆదివారం జరిగిన ఓటింగ్‌లో షెహబాజ్‌ షరీఫ్‌కు అనుకూలంగా 201 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి అయూబ్‌ఖాన్‌కు మద్దతుగా 92 ఓట్లు వచ్చాయి.

దాంతో షెహబాజ్‌ ప్రధానిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అభ్యర్థి ఒమర్‌ అయూబ్‌ఖాన్‌ బరిలో దిగారు. 72 ఏళ్ల షెహబాజ్‌ షరీఫ్‌ రేపు (సోమవారం) 33వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

తాజా పరిణామాలతో పాక్ లో మరో కీలుబొమ్మ ప్రభుత్వం అధికారం చేపడుతోంది. మిలిటరీ కనుసన్నల్లో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ PML(N) – పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP)ల నేతృత్వంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. పాకిస్తాన్ చరిత్రలో ప్రజా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పదవీ కాలం కొనసాగిన సందర్భాలు లేవు. కొత్త ప్రభుత్వం మనుగడ మిలిటరీ దయదక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉంది.

PML(N) నేత షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా, PPP నేత ఆసిఫ్ అలీ జర్దారి దేశ అధ్యక్షుడుగా ఉండేట్టు ఒప్పందం కుదిరింది. రెండు పార్టీల మధ్య విభేదాలు ఉన్నా ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించేందుకు చేతులు కలిపి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఏ పార్టీకి మెజారిటీ రాకపోవటంతో మరోసారి రెండు పార్టీలు జత కట్టాయి.

మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు షహబాజ్ షరీఫ్ సోదరుడు కాగా ఇటీవల పంజాబ్ సిఎంగా ఎన్నికైన మరియం నవాజ్ నవాజ్ షరీఫ్ కుమార్తె.  నవాజ్ షరీఫ్ లాహోర్ నుంచి జాతీయ అసెంబ్లీకి ఎన్నికైనా.. తమ పార్టీకి మెజారిటీ రాకపోవటంతో… సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించే బాధ్యత తన సోదరుడికి అప్పచెప్పారు.

నవాజ్ షరీఫ్ భారత్ పట్ల కొంత స్నేహ పూర్వకంగా ఉన్నా షహబాజ్ షరీఫ్ ప్రధానిగా మనదేశంతో సంబంధాలకు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు నవాజ్ షరీఫ్ దేశంలోనే ఉన్నారు కనుక పొరుగు దేశాలతో సంబంధాలు పునరుద్దరించేందుకు కృషి చేస్తారని ఒక అంచనా. దేశ వర్తమాన రాజకీయాల్లో తన సోదరుడు, కుమార్తె రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే పాక్ మిలిటరీని సంతృప్తి పరుస్తూనే…పొరుగు దేశాలతో సంబంధాలు, అంతర్జాతీయంగా దేశ ప్రతిస్థ కాపాడి, సుస్థిర పాలనతో ప్రజలకు భరోసా ఇవ్వాల్సి ఉంది.

దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉండటం, చమురు, నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందని స్థాయిలో ఉన్నాయి. భారతదేశంతో సంబంధాలు బలపడితేనే పాకిస్తాన్ లో సుస్థిరత సాధ్యం అవుతుందని మేధావులు, వ్యాపార వర్గాలు, సామాన్య ప్రజానీకం కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంతో స్నేహసంబంధాల వల్ల రక్షణ వ్యయం తగ్గి ప్రజా సంక్షేమానికి నిధులు పెంచవచ్చనే డిమాండ్ పెరిగింది.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం త్రైపాక్షిక కూటమిగా ఏర్పడితే దక్షిణాసియాలో ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంది. ఇప్పటికే తాలిబాన్ పాలకులు భారత్ తో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పాకిస్తాన్ అదే కోవలో చేరితే… అందుకు భారత్ కూడా చొరవ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ మూడు దేశాలు కలిస్తే పశ్చిమ చేశాల ఆయుధ కంపనీలకు ఆదాయం పడి పోతుంది. పాశ్చాత్య దేశాల కపట నీతికి చిక్కకుండా… స్నేహభావం కొనసాగితేనే దక్షిణాసియా దేశాల్లో సుస్థిరత సాధ్యం అవుతుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్